సిద్దిపేట, మార్చి 30(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దుబ్బాక నియోజకవర్గ బీజేపీలో ముసలం పుట్టింది. స్థానిక ఎమ్మెల్యే రఘనందన్‌రావు వైఖరికి నిరసనగా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నాలుగైదు రోజుల నుంచి బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. శాసనసభ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీకి దుబ్బాక నియోజకవర్గంలోని ఆ పార్టీ క్యాడర్ గట్టి షాక్ ఇస్తున్నది. దీంతో ఏంచేయలేక ఎమ్మెల్యే తల పట్టుకున్నారు. పార్టీ నేతల్లో, కార్యకర్తల్లో ఉన్న అసంతృప్తి బట్టబయలు అవుతున్నది. ఎన్నికల సమయంలో దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏఒక్కటి కూడా నెరవేర్చకపోవంతో రఘునందన్‌రావుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఇటు కార్యకర్తలనూ ఆయన పట్టించుకోవడం లేదని బీజేపీ క్యాడర్లో అసంతృప్తి నెలకొన్నది. పార్టీలో తమకు గుర్తింపు లభించకపోవడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కారని రఘునందన్‌రావు తీరుపై ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గత రెండు మూడు రోజుల్లో చాలామంది కార్యకర్తలు బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా బుధవారం దుబ్బాక మండలం ధర్మాజిపేట నుంచి 75మంది కార్యకర్తలు రాజీనామా చేసి మంత్రి హరీశ్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరారు. అక్బర్పేట- భూంపల్లి మండలంలోని తాళ్లపల్లికి చెందిన 25 మంది బీజేపీ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. గురువారం బీజేపీ దళిత మోర్చా ప్రధాన కార్యదర్శి కూతురి నర్సింహులు కూడా ఆ పార్టీకి రాజీనామా చేసి తన అనుచరులతో కలిసి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో ప్రజలకు రఘునందర్రావు అలవికాని హామీలు ఇచ్చారు. ప్రజలకు మాయమాటలు చెప్పి స్వల్ప ఓట్ల మెజార్టీతో గెలిచిన రఘునందన్‌కు కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతల నుంచి ఆయన తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. గెలిచిన రోజు నుంచి ఇప్పటి వరకు దుబ్బాక ప్రజలకు ఏం చేశారో చెప్పాలి అని స్థానిక ప్రజలు సైతం ఆయన ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని తాను చేస్తున్నట్లుగా చెప్పుకుంటూ సోషల్‌మీడియాలో ప్రచారం చేసుకోవడం తప్ప మరోటి లేదని ఆయనపై ప్రజలతో పాటు సొంత పార్టీ క్యాడర్ నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. రఘునందన్‌రావు తన సొంత గ్రామానికే ఏం చేయలేదని, ఇక నియోజకవర్గ ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల సమయంలో వాడుకున్న యువతను ఇవాళ రోడ్డు మీద పడేశారని తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కార్యకర్తలకు అండగా ఉంటానని చెప్పిన నేతనే, ఇవాళ తమను పట్టించుకోవడం లేదని సాక్షాత్తు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా నాయకుల పరిస్థితే ఇలా ఉంటే ఇక కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని బీజేపీ నేతలు బాహాటంగానే చెబుతున్నారు. దుబ్బాకలో బీజేపీ నాయకత్వంపై తమకు విశ్వాసం లేకనే తామంతా ఇవాళ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్నట్లు వారు చెబుతున్నారు. దుబ్బాక నియోజకవర్గానికి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు సహకారంతో అనేక నిధులు తీసుకువచ్చి దుబ్బాకను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్న ఎంపీ ప్రభాకర్‌రెడ్డికి మద్దతుగా నిలుస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇప్పటికే చాలా గ్రామాల్లో బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు.సీఎం కేసీఆర్ నాయకత్వలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. సీఎం కేసీఆర్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి నేతృత్వంలో పనిచేయడానికి తామంతా బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని వారు తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దుబ్బాకలో బీజేపీకి మరో భారీ షాక్ తగిలింది. గురువారం బీజేపీ దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కూతురి నర్సింలు(బట్టు నర్సింలు) బీఆర్ఎస్లో చేరారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వైఖరి నచ్చకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు ఆయన ప్రకటించారు. దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ నుంచి భారీ సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. నిన్నటి (బుధవారం) రోజు దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేటకు చెందిన బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తాళ్లపల్లికి చెందిన 25 మంది బీజేపీ నాయకులు ఎంపీ సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రానికి చెందిన బీజేపీ దళితా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కూతురి నర్సింలు (బట్టు నర్సింలు) గురువారం బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, మెదక్ ఎంపీ ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరినట్లు తెలిపారు. బీఆర్ఎస్తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యపడుతుందన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే రఘునందన్ వైఖరితో విసుగుచెందానన్నారు. నియోజకవర్గంలో యువతను ఎమ్మెల్యే మోసగించాడని విమర్శించారు. దళితులపై ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నాడని, రెండేండల్లో ఒక్కసారి కూడా తనను పిలువలేదన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి నియోజకవర్గంలో ఒక్క రూపాయి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలందరికీ రఘునందన్ నిజస్వరూపం అర్థమయ్యిందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ బక్కి వెంకటయ్య, నాయకులు రొట్టే రాజమౌళి, జీడిపల్లి రవి, బానాల శ్రీనివాస్, కిషన్‌రెడ్డి, కృష్ణ, కిషన్ తదితరులు పాల్గొన్నారు.