
చేర్యాల, నవంబర్ 1 : సీఎం కేసీఆర్ దేవాలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడంతో ఆలయాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. సోమవారం కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామిని మంత్రి తలసాని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రికి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ఈవో ఎ.బాలాజీ ఆధ్వర్యంలో ధర్మకర్తలు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగ తం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో దేవాలయాలను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని గుర్తుచేశారు.తెలంగాణ ఏర్పాటు అనంతరం కొమురవెల్లి ఆలయ దశ,దిశ మారిందన్నారు. గతంలో కొమురవెల్లిలో పర్యటించిన సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుతో కలిసి భక్తులు దేవుడికి కానుకల రూపంలో చెల్లించిన వెండితో ఆలయ దర్వాజాలు, తలుపులకు వెండి తాపడం చేయించాలని నిర్ణయించామని, ఆమేరకు పనులు పూర్తి కావడంతో మల్లన్న ఆలయం శోభాయమానంగా మారిందన్నారు.
శాశ్వత కల్యాణ వేదిక నిర్మించడంతో ప్రతి ఏటా స్వామి వారి కల్యాణోత్సవం వైభవంగా జరుగుతున్నదన్నారు. మండపంలో స్వామి వారి నిత్య కల్యాణం, పట్నాలు వేసేందుకు భక్తులు ఇబ్బందులు పడుతుండడంతో రూ.2కోట్లతో మహామండప విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. దాసారంగుట్ట పైన డోనర్ స్కీంలో గెస్ట్‌హౌస్‌లు నిర్మించేందుకు రూ.3కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించామని, కరోనాతో పనులు ఆలస్యం జరిగాయని, మూడు మాసాల్లో రోడ్డు పనులు పూర్తి చేస్తామన్నారు. రూ.2కోట్లతో ఆధునిక వసతులతో గెస్ట్‌హౌస్ నిర్మించనున్నట్లు తెలిపారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులపై సంబంధితశాఖ అధికారులు, ఈవో, చైర్మన్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎంపీపీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిద్ధప్ప, ఆలయ ధర్మకర్తలు ముత్యం నర్సింహులు, ఉట్కూరి అమర్‌గౌడ్, దినేశ్తివారీ, బొంగు నాగిరెడ్డి, చింతల పరశురాములు, కొంగరి గిరిధర్, తుమ్మల రమేశ్‌యాదవ్, పొతుగంటి కొమురవెల్లి, తాళ్లపల్లి శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ పాల్గొన్నారు.