
మెదక్, సెప్టెంబర్ 6: రాబోయే మూడు రోజులు మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని వాతావరణశాఖ తెలిపిందని, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని మెదక్ కలెక్టర్ హరీశ్ సోమవారం ఓ ప్రకటనలో ఆదేశించారు. ఇప్పటికే శనివారం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా కుంటలు , చెరువులు నిండి అలుగుపారుతున్నందున లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా సూచించారు. ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాదకరంగా పొంగిపొర్లుతున్న వంతెనలు, కాజ్‌వేలను గుర్తించి ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా రాకపోకలు సాగించేలా చూడాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో సత్వరమే స్పందించేందుకు అధికారులు హెడ్ క్వార్టర్స్‌లోనే ఉండాలని ఆదేశించారు.
24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూం ఏర్పాటు
మూడు రోజులు భారీ వర్షసూచన ఉండడంతో ముందస్తు చర్యల్లో భాగంగా మెదక్ కలెక్టరేట్లో 24 గంటలు పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశామని కలెక్టర్ హరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. నేటి నుంచి 8వ తేదీ వరకు 24 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేసే విధంగా రెండు షిప్టుల్లో పనిచేసే విధంగా సిబ్బందిని నియమించామని, వారు కంట్రోల్ రూమ్‌కు ఏ ఫోన్ కాల్ వచ్చినా వెంటనే స్పందించి సంబంధిత ఆర్డీవోలకు, తహసీల్దార్లకు సమాచారమందించి అప్రమత్తం చేస్తారని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు అ త్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని, ఆపద అ నిపిస్తే 08452-223360, 7995088720, 100 ఫోన్ చేయాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు.