
మెదక్ అర్బన్, అక్టోబర్ 18 : రైతు వేదికలు అన్నదాతలకు బడిలా మారాయి. వ్యవసాయ అధికారులు రైతు వేదికల వద్దకు వెళ్లి రైతులతో సమావేశం నిర్వహిస్తున్నారు. పంటలపై రైతులకు సలహాలు, సూచనలు ఇస్తూ ప్రభుత్వ పథకాలను అధికారులు వివరిస్తున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు చేపడుతున్న ప్రభు త్వం అన్నదాతలకు ఎవుసంపై సమస్యలను నివృత్తి చేస్తున్నది. రైతులకు పంటలపై సలహాలు, సూచనలు అందించేందుకు ఒక వేదిక ఉండాలని ప్రభుత్వం భావించి గ్రామాల్లో రైతు వేదికలను ఏర్పాటు చేసింది.
స్టడీ సెంటర్లుగా.. రైతు వేదికలు..
గ్రామాల్లో రైతు వేదికలు.. రైతులకు స్టడీ సెంటర్‌గా మారింది. గతంలో వ్యవసాయ అధికారులు తూతూ మం త్రంగా గ్రామాలకు వెళ్లి ఏదో ఒకచోట రైతులతో మాట్లాడి వచ్చేవారు. రైతులు, వ్యవసాయ అధికారులు కూర్చొని మాట్లాడుకునేందుకు ఒక వేదిక ఉండాలని భావించిన సీఎం కేసీఆర్ రైతు వేదిక భవనాలను నిర్మించారు. ప్రస్తుతం వానకాలంలో రైతులు వేసిన పంటలను అధికారులు వివరిస్తూ యాసంగిలో రైతులు వేసే పంటల గురించి వివరిస్తున్నారు. దీంతో రైతులకు వ్యవసాయశాఖ మరింత చేరువుతుంది. కూచన్‌పల్లిలో మాత్రం ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి తన సొంత ఖర్చులతో రైతు వేదికను నిర్మించారు.
రైతులకు ఎంతో ఉపయోగం..
తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన రైతు వేదికలు రైతులకు ఎంతో ఉపయోగంగా మారాయి. రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి గతంలో సరైన వేదిక ఉండేదికాదు. సీఎం కేసీఆర్ నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఒక మంచి వేదికగా మారాయి. వ్యవసాయ అధికారులు రైతు వేదికల్లో అన్నదాతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.