ఆదివారం 12 జూలై 2020
Mancherial - Jun 04, 2020 , 02:40:24

సాగులో యువరైతు

సాగులో యువరైతు

మూడెకరాల్లో జామ 

 శ్రీగంధం మొక్కల పెంపకం

ఆదిలాబాద్‌ జిల్లాలో వినూత్న ప్రయత్నం

ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : ఆదిలాబాద్‌ జిల్లా గుడిహత్నూర్‌ మండలం బెల్లూరికి చెందిన ఈ యువరైతు పేరు బోసారే గణేశ్‌. ఉన్నత విద్యను అభ్యసించిన ఈ యువకుడు జిల్లాలో రైతులు ఏటా పండించే పత్తి, సోయాబీన్‌, కంది, శనగ, గోధుమ లాంటి పంటలనే కాకుండా పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించేలా ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకోసం గ్రీన్‌ లైఫ్‌ అగ్రి డెవలప్‌మెంట్‌ సొసైటీ అనే సంస్థను ప్రారంభించాడు. రైతులకు పంట తోటలపై అవగాహన కల్పించేందుకు తనకున్న తొమ్మిది ఎకరాల భూమిలో మూడెకరాల్లో శ్రీగంధంతో పాటు పండ్ల తోటల పెంపకం చేపట్టాడు. కడియం నర్సరీ నుంచి మొక్కలు తీసుకువచ్చి గతేడాది ఆగస్టు మొదటి వారంలో నాటాడు. మూడెకరాల్లో నాటిన 800 జామచెట్లకు కాయలు కాస్తున్నాయి. నెల రోజుల్లో పంట దిగుబడి వస్తుందని గణేశ్‌ తెలిపారు. రైతులకు అవగాహన కల్పించడం కోసం యాపిల్‌, దానిమ్మ, మామిడి, సపోట, అంజిర్‌, సీతాఫలం మొక్కల పెంపకం సైతం చేపట్టాడు. ఈ యువ రైతు చేస్తున్న కృషికి ఫలితం వస్తోంది. ఈ ఏడాది రెండు గ్రామాల్లోని 30 ఎకరాల్లో పండ్ల తోటలను పెంచేందుకు రైతులు సిద్ధమయ్యారు. జిల్లాలో రైతులు వానకాలంలో పత్తి, సోయాబీన్‌, కంది.. యాసంగిలో గోధుమ, శనగ, పల్లి పంటలు పండిస్తారు. ఉద్యానవన శాఖ అధికారులు ఇప్పుడిప్పుడే పండ్ల తోటల పెంపకానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. పుచ్చకాయ, దోసకాయ లాంటి పంటలు కొన్ని ప్రాంతాల్లోనే సాగుచేస్తారు. జిల్లాలో పండ్ల తోటలు లేకపోవడంతో ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యే పండ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. వాటి ధరలు చూస్తే సామాన్యులు కొనలేరు. జిల్లాలో భూములు పండ్ల తోటల పెంపకానికి యోగ్యంగా ఉండవనే నిర్ణయానికి వచ్చిన రైతులు వాటిని పండించడానికి ముందుకు రావడం లేదు.

రైతులకు అవగాహన కోసం..

యువరైతు, విద్యావంతుడైన గణేశ్‌ జిల్లాలో రైతులను పండ్లతోటల పెంపకం వైపు మళ్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. బీఎస్సీ, బీఈడీ చేసిన గణేశ్‌ ఏడేళ్లుగా ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజనలో భాగంగా యువతకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇస్తున్నాడు. ఏడేళ్లుగా 4వేల మందికి కంప్యూటర్‌ అసిస్టెంట్‌, ఎంఎల్‌టీ, డాక్యుమెంట్‌ అసిస్టెంట్‌తో పాటు ఇతర కోర్సుల్లో శిక్షణ ఇచ్చాడు. ప్రభుత్వ శాఖలు, బ్యాంకుల నుంచి ఎలాంటి సాయం పొందకుండానే సొంత డబ్బులతో పండ్ల తోటల పెంపకాన్ని చేప్టటాడు. రూ.6 లక్షలు ఖర్చుచేసి గతేడాది తన సొంత భూమి మూడు ఎకరాల్లో జామతో పాటు శ్రీగంధం మొక్కలు పెంచుతున్నాడు. ఆలహాబాద్‌ సఫేదా, లలిత్‌ లాంటి 800 రకాల జామ చెట్లను సేంద్రియ ఎరువులు వేసి పెంచుతున్నాడు. ఇతర పండ్ల మొక్కలను సైతం నాటి వాటిని సంరక్షిస్తున్నాడు. తన చేనులో ఉన్న బోరుతో వీటికి నీటిని అందిస్తున్నాడు.

జిల్లాలో ఏ పంటలైనా పండుతాయి..

జిల్లాలో ఎలాంటి పంటలనైనా సాగుచేసే అవకాశాలున్నాయి. ఇందుకోసం నిపుణుల సలహాలు, సాగువిధానంపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రైతులకు ఇలాంటి అవకాశాలు తక్కువగా ఉండడంతో నేను స్వయంగా వారికి పండ్లతోటల పెంపకంపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చాను. ఇందుకోసం గ్రీన్‌లైఫ్‌ అగ్రి డెవలప్‌మెంట్‌ సొసైటీని ప్రారంభించాం. పది మంది సభ్యులతో రైతులను చైతన్యపరుస్తున్నాం. నేను స్వయంగా పండ్లతోటలను పెంచుతున్నారు. రోజు నలుగురైదుగురు రైతులు వచ్చి పంటను చూస్తారు. జిల్లాలో ఎక్కడైనా పండ్లతోటలను పెంచవచ్చు. ప్రారంభంలో దిగుబడులు తక్కువగా వచ్చినా మన కృషితో పెంచుకోవచ్చు.      

- బోసారే గణేశ్‌, రైతు, బెల్లూరి, ఆదిలాబాద్‌


logo