కోస్గి, అక్టోబర్ 31: యువకుడి వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న నవవధువు శ్రీలత కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి శుక్రవారం పరామర్శించారు. మృతురాలు శ్రీలత కుటుంబ సభ్యులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన చంద్రవంచ గ్రామంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎంగా రేవంత్‌రెడ్డి గద్దె నెక్కగానే కొడంగల్‌లో కాంగ్రెస్ నాయకుల ఆగడాలు మితిమీరి పోయాయని ఆరోపించారు. సీఎంగా ఎన్నికైన తర్వాత అభివృద్ధిలో చూపించాల్సిన దూకుడు కబ్జాలు, భూ తగాదాలపై చూపిస్తున్నారన్నారు. నాయకులు తీరు మార్చుకోకపోతే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.
గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత డ్రైవర్ అమ్మాయి మృతికి కారణమని తెలిసి కూడా అతడిని రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పళ్లైన మూడు రోజులు గడవకముం దే నవ వధువు శ్రీలతను కాంగ్రెస్ నేత డ్రైవర్ శ్రీశైలం వేధించడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందని పట్నం ఆరోపించారు. పెళ్లింట సంతోషంగా ఉండాల్సిన వేళ దుఃఖానికి కారణమైన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవ వధువు మృతికి కారణమైన కాంగ్రెస్ నేత డ్రైవర్‌తో పాటు కాంగ్రెస్ నాయకుడిపై కూడా కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు. పోలీసులు కాంగ్రెస్
నాయకుల ఒత్తిడికి తలొగ్గి కేసును నీరు గార్చాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. కోస్గి ఎస్సై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తూ వారి మెప్పుకోసం పని చేస్తున్నారని ఎస్సై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా గ్రామస్తులు సైతం ఎస్సై తీరుపై మాజీ ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఇలా కాంగ్రెస్ కార్యకర్తలా పని చేయడం కంటే కాంగ్రెస్ పార్టీలో చేరి సీఎం భజన చేయాలని సూచించారు. ఆయన వెంట మాజీ వైస్ ఎంపీపీ సాయిలు, నిరంజన్‌రెడ్డి, వెంకటనర్సిములు, మాజీ ఎంపీటీసీ పోశప్ప, బెజ్జు నీలప్ప, కోనేరు సాయప్ప ఉన్నారు.