జడ్చర్లటౌన్, మే 16 : జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాం తంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడు కత్తితో యువతి గొంతు కోసి హత్య చేసిన ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిమ్మబావిగడ్డ ప్రాంతంలో నివాసముంటున్న వైష్ణవి (24) అనే యువతి జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌లోని ఎస్వీకేఎం పాఠశాలలో ఏడాదికాలంగా రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్నది. రోజువారీగా శనివారం సాయంత్రం పాఠశాల డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరింది.
ఈ క్రమంలో గత కొంతకాలంగా ప్రేమ పేరుతో వేధిస్తున్న యువకుడు అప్పటికే వైష్ణవి ఇంటికి సమీపంలో కాపుకాసి ఒంటరిగా వెళ్తున్న వైష్ణవిని అడ్డగించి కత్తితో గొంతు కోశాడు. గొంతు, కడుపు భాగాల్లో విచక్షణా రహితంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై వైష్ణవి అక్కడిక్కడే మృతి చెందింది. వెంటనే స్థానికులు గుర్తించి యువకుడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. స్థానికుల దాడిలో సదరు యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువకుడిని చికిత్స నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. యువతి మృతిపై విచారణ చేపట్టిన అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల మార్చురీకి తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు.