ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. యాసంగిలో సాగైన పంటలకు నీటి తడులు అందించలేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. చేతికి వస్తుందన్న పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో రైతులు ఆశలు ఆవిరైపోతున్నాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి బోర్లల్లో నీళ్లు లేక వందల ఎకరాల్లో వరి రైతులు గోస పడుతున్నారు. రైతు భరోసా అందకున్నా.. వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చి పెట్టిన పెట్టుబడులు సైతం ఎల్లని దుర్భర పరిస్థితి దాపురించింది. దీనికి తోడు కరెంట్ కష్టాలు మొదలవడంతో వేసిన పంటలను ఎలా కాపాడుకోవాలోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మహ్మదాబాద్, మార్చి 2 : మండలంలో వ్యవసాయమే జీవనాధారం. మండలంలో దాదాపు 5,500 ఎకరాల్లో వరిని రైతులు సాగు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరెంటు కోతలు, సాగునీళ్లు లేక వరి పొ లాలు బీటలు వారుతున్నాయి. వరి ఎండుముఖం పడుతున్నది. నిం డు వేసవి రాక ముందే కరువు చాయలు రైతులను భయపెడ్తున్నాయి. రైతులు ముందుగా అంచనా వేసుకుని పంటలు సాగు చేసినా వారి అంచనాలను తలకిందులుగా చేస్తూ పంటలు ఎండుతుండడంతో క న్నీళ్లే మిగులుతున్నాయి.
ప్రభుత్వం కరెంట్ సరఫరాపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఎప్పడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో.. అర్థంకాక రై తులు తికమకపడుతున్నారు. దీనికితోడు లోవోల్టేజ్ సమస్య రైతులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. రైతుభరోసా సాయం అందకు న్నా.. బయట వడ్డీకి అప్పులు తెచ్చి రైతులు పంటలు సాగు చేశారు. ఇప్పుడేమో వేసిన పంటలు ఎండుతుండడం.. తెచ్చిన అప్పులు పెరుగుతుండడంతో రైతుల పరిస్థితి అయోమయంగా తయారైంది.
రైతులు వ్యవసాయం చేసుకోవాలంటే ప్రభుత్వం ప్రోత్సాహం ఎంతైనా అవసరం. కానీ పంటల సాగు కోసం తీసుకున్న రుణం మాఫీ కాలేదు. రూ.వేలు తెచ్చి పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తే నాలుగెకరాలు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పెట్టిన పెట్టుబడి కూడా ఎల్లని దుస్థితి. ఇట్లా ఉంటే రైతులు వ్యవసాయం ఎలా చేసుకోవాలి.. వచ్చిన నష్టాన్ని ఎలా భరించాలి.
– కుర్వ బీరయ్య, రైతు, మహ్మదాబాద్
మా చిన్నాన్న.. నేను కలిసి ఐదెకరాల్లో వరి సాగు చేశాను. కరెంటు సమస్యలతో మా నాలుగు ఎకరాల పొలం ఎండిపోయింది. పంటలు ఎండుతుండడంతో ఆశలు ఆవిరవుతున్నాయి. మండలంలో కరెంటు ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో.. అర్థం కావడం లేదు. సయమపాలన లేకపోవడంతో బోర్లు పనిచేయక సాగునీళ్లు అందక పొలాలు నెర్రెలుబారుతున్నాయి. కరెంటు అధికారులను ఎప్పుడు అడిగినా ఎల్సీ తీసుకున్నామంటూ సమాధానం చెబుతున్నారు.
– కుర్వ కృష్ణ, మహ్మదాబాద్
మండలంలో కరెంట్ సమస్యలు ఏమి లేవు. పుట్టపహాడ్ నుంచి కొత్త లైన్ గుంజడంతో అప్పుడప్పుడు ఎల్సీ తీసుకుంటే నిలిచిపోతోంది. రోడ్డు విస్తరణలోనూ ఎల్సీ తీసుకొని పనులు చేపడుతున్నారు. వ్యవసాయానికి కరెంటు ఎప్పటిలాగే ఇస్తున్నాం. లోవోల్టేజీ, ఇతర సమస్య లేవు. ఈ క్రమంలో సాగుకు కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
– సత్యం, ఏఈ, విద్యుత్ శాఖ