మహ్మదాబాద్, అక్టోబర్ 25 : పురుగుల అన్నంతో అవస్థలు పడుతున్నామని మండలకేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లంబాడ హక్కుల పోరాట సమితి (ఎల్‌హెచ్‌పీఎస్) నాయకులు, మాజీ సర్పంచులు పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చింతపండు పులుసు, నీళ్ల చారు, కుళ్లిన వంకాయలతో వండిన కూర, ఉడికీఉడకని అన్నం చూసి అవాక్కయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థినులు మాట్లాడుతూ నిత్యం ఒకే రకమైన ఆహారాన్ని తినలేకపోతున్నామన్నారు.
అన్నంలో వస్తున్న పురుగులను బయటకు తీసేసి తింటున్నామన్నారు. ఉదయం ఉడికీఉడకని కిచిడీ చేయడంతోపాటు మెనూ ప్రకారం భోజనం వడ్డించడంలేదని, చికెన్‌ను కూడా నీళ్ల చారు మాదిరిగా చేయడంతోపాటు కొసిరికొసిరి పెడుతున్నారని గోడు వెల్లబోసుకున్నారు. వార్డెన్‌కు అయినా చెబుతామంటే వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే వస్తున్నదన్నారు. ఆకలికి తట్టుకోలేక బిస్కెట్లు కొనుక్కొని తింటున్నామన్నారు. అనంతరం మాజీ సర్పంచులు చంపాబాయి, గీతా, పాల్గుణ, ఎల్‌హెచ్‌పీఎస్ ఉమ్మడి మండలాధ్యక్షుడు భాషా నాయక్ మాట్లాడుతూ శుక్రవారం మెనూ ప్రకారం ఆకుకూర పప్పు, సాంబారు బదు లు చింతపండు నీళ్ల పప్పుచారు, కుళ్లిన కూరగాయల భో జనం పెట్టడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాయం త్రం ఇచ్చిన స్నాక్స్‌లో కూడా పురుగులు పట్టి పుచ్చిపోయిన శనగలను ఎండబెట్టి.. ఉడికించి అందించడమేంటన్నారు. అధికారులు వెంటనే స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం అందించాలని డిమాండ్ చేశారు. వార్డెన్ నిత్యం అందుబాటులో ఉండే లా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయకులు పాండునాయక్, సంతోశ్, శ్రీనునాయక్, దేవేందర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
పొరపాటు జరగకుండా చూస్తాం : వార్డెన్ పద్మ
విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు సు కుంటాం. వివిధ కారణాలతో ముగ్గురు వర్కర్లు గైర్హాజరు కా వడంతో ఒక్కరే ఉన్నారు. దీంతో కొన్ని ఇబ్బందులు వ చ్చా యి. మరోసారి పొరపాటు జరగకుండా చూస్తాను. వా రం లో ఒకటి, రెండు రోజులు వస్తాననడంలో వాస్తవం లేదు.