తిమ్మాజిపేట : అక్షరాస్యత పెంచేందుకు గ్రామాల్లో మహిళా సంఘాలు ( Womens groups ) తోడ్పాటు నందించాలని, సంఘాల సభ్యులు సంపూర్ణ అక్షరాస్యత ( Literacy ) సాధించాలని జిల్లా బాలికల విద్య అధికారిని శోభారాణి ( Shobarani ) కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించిన అనంతరం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఐకేపీ కార్యాలయంలో మహిళా సంఘాలతో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
బాలికల విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని తెలిపారు. ఇందుకోసం కేజీబీవీ, బాలికల వసతి గృహాలు ఏర్పాటు చేసిందని అన్నారు. బాలికలను 14 సంవత్సరాల వరకు తప్పనిసరిగా బడిలోనే ఉంచాలన్నారు. మహిళా సంఘాలు బాలికలను తప్పనిసరిగా బడిలో చేర్పించేలా కృషి చేయాలన్నారు. ఎక్కడైనా బాలికలు బడిలో కాకుండా, పనిలో చేరితే తమకు సమాచారం అందించాలని సూచించారు. 14 ఏళ్లు దాటిన వారు కూడా ఓపెన్ టెన్త్ ద్వారా పాస్ అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సత్యనారాయణ శెట్టి, కేజీబీవీఎస్వో సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.