Women’s Day | మరికల్, ఊట్కూర్, కల్వకుర్తి రూరల్, మార్చి 7 : మహబూబ్‌నగర్ జిల్లాలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మరికల్ మండలంలో విద్యార్థుల తల్లులకు క్రీడాపోటీలను నిర్వహించగా.. ఊట్కూర్ మండలంలో మహిళా టీచర్లను సన్మానించారు.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్ మండలంలోని పసుపుల ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లులకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రావణి మాట్లాడుతూ.. ఉమెన్స్ డే నాడు మహిళలను సత్కరించాలనే ఉద్దేశంతో మహిళలకు క్రీడా పోటీలను నిర్వహించి పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను అందజేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల ఎదురుగా విద్యార్థుల తల్లులు ఆటల పోటీల్లో పాల్గొనడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అశ్విన్, తదితరులు పాల్గొన్నారు
మండలంలోని మొగ్దూంపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో శుక్రవారం మహిళా దినోత్సవం సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శివరాజ్ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ.. నేటి సమాజంలో అతివలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలు సమాజ భవిష్యత్తుకు పునాది రాళ్ళని కొనియాడారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సత్యమ్మను, మహిళా ఉపాధ్యాయులు నర్మద, శ్రీదేవి, స్కావెంజర్ సత్యమ్మ, సంజమ్మ పాల్గొన్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం జీడిపల్లి గ్రామంలోని యూపీఎస్ పాఠశాలలో శుక్రవారం ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం నిర్వహించుకున్నారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా విద్యార్థులు చక్కటి వేషధారణలతో తాము ఎంచుకున్న తరగతులకు పాఠాలను బోధించారు. కార్యక్రమనంతరం ఉత్తమ పాఠ్య బోధన చేసిన ఉపాధ్యాయులకు అతిథులు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హెచ్ఎం వాసుదేవులు, ఉపాధ్యాయులు, వెంకటేశ్వర్లు, రహీం, రేణుక, ప్రసన్న విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Damaragidda
దామరగిద్ద : మండల కేంద్రంలోని సిపిఎస్ పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి మిగతా తరగతులకు పాఠాలు బోధించారు. వీటిని ఆ పాఠశాల ఉపాధ్యాయులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చందూజమన్, విద్యార్థులు పాల్గొన్నారు.
నివేదిత పాఠశాలలో మహిళా దినోత్సవం ఘనంగా జరపకుంటున్న ఉపాధ్యాయులు విద్యార్థులు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నివేదిత పాఠశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు తమ మహిళా ఉపాధ్యాయులకు గ్రీటింగ్ కార్డ్స్, పూలతో శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సమాజంలో స్త్రీ ప్రాముఖ్యతను తెలియజేసేవిధంగా పాటలకు నృత్యాలు చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ ఉపన్యాసాలతో మహిళల ప్రాముఖ్యతను వివరించారు.