జడ్చర్లటౌన్, ఏప్రిల్ 13 : కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండి పోతు న్నాయి. మరోవైపు తాగునీటి కోసం మహిళలు బిందెలతో ఏటు వెళ్లాలో తెలియక వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలోనే మంచినీటి కోసం మహిళలు ధర్నా దిగటం గమనార్హం. పది రోజు లుగా మంచినీటి సరఫరా లేకపోవటంతో ఆగ్రహించిన మహిళలు ఖాళీ బిందెలతో సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
మున్సిపాలిటీ పరిధిలోని పాతబజార్‌లో 10 రో జులుగా మంచినీటి సరఫరా కావటంలేదని..కనీసం మొ ఖం కడుక్కోవడానికి నీళ్లు లేవంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల కోసం ఉదయం అడిగితే మధ్యాహ్నం విడుస్తామని, మధ్యాహ్నం అడిగితే సాయంత్రం విడుస్తా మంటూ పదిరోజులుగా నీళ్లు సరఫరా చేయకుండా సిబ్బం ది కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం బోరు బావుల నుంచి నీళ్లు తెచ్చుకుందామంటే ఒక్క బోరు లేకపో యే.. ఎండాకాలంలో నీళ్లు లేక చచ్చిబతుకుతున్నామని మహిళలు వాపోయారు. నాయకులు, అధికారులెవరూ మా గోడును పట్టించుకోవటంలేదనే మున్సిపాలిటీ ఎదుట ఖాళీ బిందెలతో ధర్నాకు వచ్చామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
సమాచారం తెలుసుకున్న మున్సిపల్ నీటిసరఫరా సిబ్బంది అక్కడికి చేరుకొని ప్రస్తుతానికి నీటి ట్యాంకర్ పంపిస్తామని, మిషన్ భగీరథ పైపులైన్ బాగు చేశాక మంచినీటి సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు ధర్నాను విరమించి అక్కడి నుంచి వెళ్లి పోయారు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా చేసిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మున్సిపల్ కమిషనర్ లక్ష్మారెడ్డికి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.