వనపర్తి, జూలై 16 : ఉమ్మడి రాష్ట్రంలో కరువు, కాటకాలతో వలసలకు నిలయమైన పాలమూరును తెలంగాణ స్వరాష్ట్రంలో పచ్చని పంటలతో కళకళలాడేలా తీర్చిదిద్దుకున్నామని..తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో వచ్చిన మార్పును గమనించాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఉదయం పెబ్బేరు మండలంలోని కంచిరావుపల్లి గ్రామానికి చెందిన 300 మంది ఎంఎస్ఎఫ్, ఏఐఎస్ఎఫ్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అలాగే మధ్యాహ్నం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో 2 వేల మంది పెయింటర్స్, భవన నిర్మాణ, ఫ్లోరింగ్ కార్మికులు.., ఆర్ఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మంది ఆర్ఎంపీ డాక్టర్లు మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. ముందుగా నియోజకవర్గ అభివృద్ధిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాష్ట్రంపై ఉన్న ప్రేమతో 70ఏండ్లలో సాధించని అభివృద్ధి కేవలం తొమ్మిదేండ్లలో చేసి చూపించారని అన్నారు. ప్రజలకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నూతన జిల్లాలు ఏర్పాటు చేసి సమస్యలు తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
54శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని వివరించారు. నాడు వ్యవసాయం దండుగ అని హేళన చేసిన వారికి వ్యవసాయం పండుగలా సీఎం కేసీఆర్ చేసి చూపించారని కొనియాడారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ ఎదిగిందని, రైతులు దర్జాగా బతికేందుకు రైతుబంధు, రైతుబీమాతోపాటు సాగునీళ్లు అందించి పచ్చని పల్లెలను కళ్లారా చూస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల కుటుంబాలకు రూ.72వేల కోట్ల రైతుబంధు అందజేస్తున్నట్లు వెల్లడించారు. 24గంటల ఉచిత కరెంటు రైతాంగానికి ఇచ్చి సాగును పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
ప్రజలు చేసిన అభివృద్ధిని గమనించి బీఆర్ఎస్కు అండగా నిలవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్, పార్టీ శిక్షణ తరగతుల జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం రెడ్డి, గొర్రెల కాపరుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి యాదవ్, పట్టణ ప్రధాన కార్యదర్శి రమేశ్, నాయకులు ప్రేమ్‌నాథ్ రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎస్సీసెల్ జిల్లా కన్వీనర్ కొమ్ము చె న్నయ్య, ఎంఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ రా జేశ్, టీఎంఎస్ఎఫ్ జిల్లా కో కన్వీనర్ శ్రీ నాథ్, శివ, రాంబాబు, హరీశ్, వినోద్, కల్యాణ్, రామకృష్ణ, రాఘవేంద్ర, బాలకృష్ణ, బాలరాజు, రాజు, వినయ్, చిన్న, శ్రీను పాల్గొన్నారు.