మూసాపేట, ఆగస్టు 17 : మహబూబ్‌నగర్ జిల్లా కేం ద్రంలోని బండమీదిపల్లి వద్ద మల్లికార్జున వైన్స్ షాపు ని ర్వాహకులు దాడిచేసి ఓ యువకుడిని హత్య చేసిన ఘటన మరువకముందే.. మూసాపేట మండలకేంద్రంలోని కార్తీక్ వైన్స్ షాపు నిర్వాహకులు మరో యువకుడిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. మూసాపేటలోని బంగ్లాగడ్డకు చెందిన జనార్దన్‌తోపాటు ముగ్గురు యువకులు కార్తీక్ వైన్స్‌లో బీర్లు తీసుకొని పర్మిట్ రూంకు వెళ్లారు.
చికెన్ ఆర్డర్ చేసి డబ్బులు చెల్లించారు. బీర్లు తాగడం అయిపోతున్నా చికెన్ రాలేదు. దీంతో యువకుడిని పిలిచినా స్పందన లేకపోవడంతో పక్కనున్న ఖాళీ సీసాతో డబ్బాకు కొట్టి పిలిచారు. సీసా ఎందుకు విసిరారని వైన్స్ నిర్వాహకులు వచ్చి చంద్రశేఖర్‌పై దాడికి పాల్పడ్డారు. చుట్టుపక్కల వారు చెప్పినా వినకుండా రోడ్డువెంట దాడిచేస్తూ తీసుకెళ్లారు.
మిగతా వారు వెంటనే 100కు డయల్ చేశారు. మూసాపేట పోలీసులు రావడంతో వైన్స్ నిర్వాహకులు యువకుడిని వదిలేశారు. పోలీసులు వారందరినీ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసులు సకాలంలో చేరుకోకపోతే మరో ప్రమాదం జరిగేద ని, దాడిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా దాడికి పాల్పడ్డవారు కూడా మద్యం తాగడంతో గొడవ చోటుచేసుకున్నదని తెలిపారు.