భూత్పూర్ : పాలమూరు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక నిధులను తీసుకువస్తానని దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి (MLA Madhusudhan Reddy) అన్నారు. శుక్రవారం పట్టణ పరిధిలోని గోపులాపూర్ గ్రామంలో సన్న బియ్యం( Rice) పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ఏటా వందల కోట్లను మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
పేదలు ఆరోగ్యం ఉండడానికి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. అనంతరం గ్రామంలో వీధుల గుండా పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 11 కేవీ, 33 కేవీ విద్యుత్ తీగలు ఇండ్ల మీదుగా ఉండడాన్ని గమనించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డ్రైనేజీ , సీసీ రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు ఎమ్మెల్యేకు వివరించారు.
భూత్పూర్ నుంచి గోప్లాపూర్ వరకు వెళ్తున్న రోడ్డు గుంతల మయంగా మారడంతో ఈ రోడ్డును పునరుద్ధరించాలని కోరారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న వార్షికోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే హాజరై సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. ఆయన వెంట మున్సిపల్ కమిషనర్ నూరుల్ నజీబ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నవీన్ గౌడ్, జిహెచ్ఎం ఆనందమ్మ, కాంగ్రెస్ మండల నాయకులు హర్యానాయక్, విజయ్, బోరింగ్ నర్సింలు, ఆనంద్, మశ్చందర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.