గద్వాలటౌన్, జనవరి 25 : భారతదేశ 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు అంతా సిద్ధమైంది.. పల్లె నుంచి పట్నం దాకా శుక్రవారం జాతీయ పండుగ సంబురాల్లో పాలుపంచుకునేందుకు ప్రజలంతా తహతహ లాడుతున్నా రు.. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతోపాటు విద్యాసంస్థల్లో ఏర్పాట్లు ఊపందుకున్నాయి.. గణతంత్ర దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా నిర్వహించేందుకు జిల్లా ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. కాగా కొద్దిపాటి అజాగ్రత్తతో ఎక్కడో ఒక చోట ఏదో ఒక అపశ్రుతి చోటు చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.. మరి అలాంటి పొరపాట్లు జరగకుండా కొన్ని విషయాలు.. జాగ్రత్తలు మనం తెలుసుకోవాలి.. అలాగే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకొంటాం.. జాతీయ జెండా పతాకం నిబంధనలు ఏమిటో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మన దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యాడు. తరువాత దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. 1947 ఆగస్టు 29న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చైర్మన్‌గా ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ రూపుదిద్దుకోవడానికి అంబేద్కర్‌తోపాటు ఎందరో మహానుభావులు, మేధావులు నిరంతం కృషి చేశారు. ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి వాటన్నింటికీ భిన్నంగా ప్రజాస్వామ్య విధానంలో భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. అప్పటికీ సం తృప్తి చెందక మళ్లీ అనేక సవరణలు చేపట్టారు. అనేక సవరణల అనంతరం 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. రాజ్యాంగం రూపకల్పన చేయడానికి 2 సంవత్సరాల, 11నెలల, 18రోజులు పట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా మన రాజ్యాంగం గుర్తించబడింది. ఇలా తయారైన రాజ్యాంగాన్ని 1950 జనవరి 26న అమలు పర్చారు. దీంతో భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా రూపుదిద్దుకున్నది. అయితే భారత జాతీయ కాంగ్రెస్ 1930 జనవరి 26న పూర్ణ స్వరాజ్‌కు పిలుపునిచ్చిన రోజు కావడంతో జనవరి 26ను గణతంత్ర దినోత్సవ రోజుగా అమలు చేశారు.
రాజ్యాంగాన్ని ఏడుగురు సభ్యులతో కూడిన డ్రాప్టింగ్ కమిటీ తుది ప్రతిని రూపొందించింది. 1947 ఆగస్టు 29న ఏడుగురు సభ్యులతో కూడిన ముసాయిదా కమిటీ ఏర్పాటైంది. కమిటీకి బీఆర్ అంబేద్కర్ చైర్మన్ కాగా అల్లాడి కృష్ణస్వామిఅయ్యర్, ఎన్ గోపాలస్వామి, కేఎం మున్షీ, మహ్మద్ సాదుల్లా, బీఎల్ మిట్టర్, డీపీ ఖైతన్ సభ్యులుగా వ్యవహరించారు. ఆ తరువాత ఖైతన్ మరణించడంతో టీటీ కృష్ణమాచారి సభ్యుడిగా కొనసాగారు. అయితే తొలుత భారత రాజ్యాంగ ముసాయిదాను బీఎన్‌రావు రూపొందించారు. ఆ ముసాయిదాకు అనేక మార్పులు చేసి డ్రాప్టింగ్ కమిటీ నూతన రాజ్యాంగాన్ని రూపకల్పన చేసింది.
జాతీయ పతాక నియమావళి అనేది భారత జాతీయ పతాక వాడకాన్ని నిర్ధేశించే చట్టాల సమహారం. 1950లో 1971లో రూపొందించిన చట్టాల్లోని అంశాలను కలిపి 2002లో ఓ సరికొత్త చట్టాన్ని రూపొందించారు. 2002 ముందు జాతీయ సెలవుదినాల్లో తప్పా మిగతా సందర్భాల్లో ప్రజలు ఎగురవేసేందుకు అనుమతి ఉండేది కాదు. అయితే కొన్ని చట్టాలని సుప్రీం కోర్టు 2002 జనవరి 26న అమల్లోకి తెచ్చింది. అయితే చట్టాలు భారత జాతీయ పతాక నియామవళి కిందికి రాకపోయినా తప్పనిసరిగా పాటించాలని కోర్టు సూచించింది.
* జాతీయ పతాకాన్ని ఎలాంటి ప్రకటనలకు వినియోగించరాదు.
* అలాగే పతాక స్తంభంపై ఎలాంటి గీతలు కానీ ప్రకటనలు కాని ఉండరాదు.
* విశేష అలంకరణగా జెండాను వాడరాదు.
* పతాకం ఎప్పుడు నేలను, నీటిని తాకరాదు. విగ్రహాల మీద, సన్మానాలకు వినియోగించరాదు.
జెండాలో మూడు రంగులు సమానంగా ఉండాలి. కాషాయపు రంగు జెండాలో పైభాగంలో మధ్యలో తెలుపు కింది భాగంలో ముదు రు ఆకుపచ్చ ఉండాలి. మధ్యలో 24 చువ్వలతో నీలం రంగులో అశోక చక్రం తప్పనిసరి ఉండాలి. జెండా పొడవు, వెడల్పులు 3:2గా ఉండాలి. పతాకాన్ని ఖాదీ, చేనేత వస్ర్తాలతో తయారు చేసిందై ఉండాలి. ఇతర వాటితో చేసిన పతాకాన్ని ఎగురవేస్తే శిక్షార్హులు అవుతారు. జెండా ఎగురు వేసే సమయంలో కాషాయపు రంగు పై భాగంలో ఉండాలి. జెండాను వాతావరణ పరిస్థితుల కనుగుణంగా సూర్యోదయం వేళలో ఎగుర వేసి సూర్యస్తమయ సమయంలో అవనతం చేయాలి. స్టేజీలపై ప్రసంగకర్తల కుడివైపు జెండా ఉండాలి. జాతీయ జెండాకు సమానంగా ఇతర ఏ జెండాలను ఎగురవేయరాదు. జాతీయ జెండాను ఊరేగింపుల్లో, కవాత్తుల్లో ఇతర జెండాలతో కలిసి తీసుకెళ్లేటప్పుడు ఇతర జెండాల కంటే ముందన ఉండాలి. లేదా కుడి వైపు అయినా ఉండాలి. జెండాను ఎగుర వేసేటప్పుడు అవనతం చేసేటప్పుడు జెండాకు అభిముఖంగా మనం ఉండా లి. ఎగురవేసేటప్పుడు వేగంగా, అవనతం చేసేటప్పుడు మెల్లగా దింపాలి. ఉద్దేశ పూర్వకంగా జెండాను అవమానించడం వంటి చర్యలకు పూనుకుంటే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవు.