కల్వకుర్తి, నవంబర్ 18 : రైతులు పండించిన పత్తిని కొనుగోలు చేయడానికి ఆంక్షలు ఎందుకు విధిస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో లేని విధంగా సీసీఐ కొత్తకొత్త నిబంధనలు పెట్టి రైతుల పండించిన పత్తిని కొనుగోలు చేయకుండా కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు. రాష్ట్రంలో చేతకాని, చావలేని ప్రభుత్వం అధికారంలో ఉండడంతోనే రైతులకు ఈ దుస్థితి దాపురించిందని దుయ్యబట్టారు. మంగళవారం కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ సమీపంలోని బాలాజీ జిన్నింగ్ వద్ద మంగళవారం మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ నేతృత్వంలో పత్తి రైతులకు అండగా రైతులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏడు క్వింటాళ్ల నిబంధన ఎత్తివేయాలని,20 వరకు తేమ ఉన్నా పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోళి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సరైన వ్యవసాయ ప్రణాళిక లేకుండా గుడ్డెద్దు చేల్లో పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్లనే రైతులు కష్టాలు పడాల్సి వస్తుందని మాజీ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని, రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ ఏ స్థాయి పోరాటానికైనా సిద్ధంగా ఉందని ఆయన తేల్చిచెప్పారు.
పత్తి కొనుగోళ్లలో సీసీఐ అనుసరిస్తున్న విధానాలతో ఇబ్బందులు పడుతున్న పత్తి రైతులకు, పత్తి మిల్లుల సమ్మె మరింత ఇబ్బందులు తెచ్చిపెట్టిందన్నారు. మిల్లుల వద్దకు పత్తిని తీసుకువచ్చిన రైతులు చలికి వణుకుతూ గడ్డ కడుతున్నారని, రైతుల పరిస్థితిపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండేందుకు, పత్తి రైతుల పక్షాన ఉద్యమిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచేందుకు పత్తి మిల్లుల వద్ద రైతులకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని, దాదాపు 29లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని మాజీ మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు కేవలం 1.19లక్షల మెట్రిక్ టన్నుల పత్తి మాత్రమే సీసీఐ కొనుగొలు చేసిందని.. ఇంకా దాదాపుగా 28లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగొలు చేయాల్సి ఉందని చెప్పారు.
పత్తిని కొనుగోలు చేయవద్దనే ఉద్దేశంతోనే సీసీఐ కొర్రీలు పెడుతుందని మాజీ మంత్రి మండపడ్డారు. కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్స్ పరిశ్రమల ప్రయోజనాల కోసం పత్తి దిగుబడులపై సుంకం ఎత్తివేయడం వల్ల దేశంలోని పత్తి రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సీసీఐ ఎకరాకు 12 కింటాళ్ల పత్తిని కొనుగొలు చేయాలని తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్రంపై వత్తిడి తీసుకువచ్చి రైతులకు మేలు చేకూర్చే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. కల్వకుర్తి నియోజకవర్గంలో పత్తిని ఎక్కువగా సాగుచేస్తారని. పత్తిని అమ్ముకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పత్తిని మద్దతు ధరకు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు ఎడ్మ సత్యం, శ్రీశైలం, బీఆర్ఎస్ నాయకులు పత్యానాయక్, అర్జున్‌రావు, గోవర్ధన్, సూర్యప్రకాశ్‌రావు, రవితేజ, విజయ్‌గౌడ్, సురేశ్, శ్రీధర్, మనోహర్‌రెడ్డి, రుక్నోద్దీన్, బోజిరెడ్డి, ఈశ్వరయ్య, జంగయ్య, సైదులుతోపాటు రైతులు పాల్గొన్నారు.
పంట కొనుగోళ్ల బాధ్యత ప్రభుత్వాలదే..

వనపర్తి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : రైతులు పండించిన పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటల కొనుగోలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి 16 మంది ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నారని, తెలంగాణలో అన్నదాతలు పండించిన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితులు లేక అల్లాడిపోతుంటే రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న 16 మంది ఎంపీలు ఏం చేస్తున్నారని నిరంజన్‌రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లను నిలిపి వేసి జిన్నింగ్ మిల్లులు నిరవధిక బంద్ పాటించడంతో మంగళవారం పెద్దమందడి మండ లం వెల్టూరు సమీపంలోని ఎస్ఎస్వై జిన్నింగ్ మిల్లు ముందు పత్తి రైతులు చేపట్టిన ఆందోళనలో మాజీ మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఏ పత్తి జిన్నింగ్ మిల్లుల ముందు చూసినా బండ్లు బారులు తీరాయన్నారు. రాత్రింబవళ్లు రైతన్నలు కష్టపడి పంటలు పండిస్తే ఇలా కొనుగోలు సమాయానికి చుక్కలు చూపిస్తున్నారన్నారు. కేంద్రం పత్తి కొనుగోలుపై కేవలం ప్రకటన చేసింది తప్పా ఆచరణ లేదన్నారు. ఎకరాకు ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తామని కొర్రి పెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. అసలు సమయంలో జిన్నింగ్ మిల్లులు సమ్మెకు పూనుకున్నాయని, కేంద్రం చొరవ తీసుకుని నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తి ముడిసరుకుపై 11 శాతం సుంకాన్ని కేంద్రం తగ్గించిందన్నారు. ఇంతలా అదే ప్రేమ ఇక్కడ పంటలు పండించిన రైతులపై ఎందుకు చూపించడం లేదన్నారు.
కార్పొరేట్ల కోసం రూ.లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసే కేంద్రం పంటలు పండిస్తున్న అన్నదాతలను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. 11శాతం సుంకాన్ని తగ్గించే డబ్బును రైతుల కోసం వెచ్చిస్తే.. కొనుగోలు సమస్య ఉండదన్నారు. కేవలం ఎంఎస్పీ ప్రకటించడం తప్పా కొనుగోళ్ల ఆచరణ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో దాదాపు 50 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు సాగు చేశారని, ఈ లెక్కన్న ఎన్ని లక్షల టన్నుల పత్తి వస్తుందో అంచనా వేయాలన్నారు. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి తక్కువలో తక్కువగా వస్తుందని, అలాగే ఎక్కువలో ఎకరాకు 20 క్వింటాళ్ల పత్తిని పండించే రైతులున్నారన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేసి పంటలను దళారులకు అప్పగించేలా కేంద్రం కుట్ర చేస్తున్నా..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు కేంద్రంపై నోరుమెదపడం లేదన్నారు. కేవలం రాజకీయ దృ ష్టి, వారి పదవులను కాపాడుకునే ప్రయత్నం తప్పా రైతులు ఏమైపోయినా పర్వాలేదన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్షాల మీద తిట్ల దండకం తప్పా రైతులను పట్టించుకునే వ్యవస్థ రాష్ట్రంలో లేదన్నారు. రైతులు పండించిన పంటల కొనుగోళ్ల ఇబ్బందులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తిగా బాధ్యత వహించాలని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు. రైతుల సమస్యలు తీరేదాకా వారికి అండగా ఉంటామని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను వెంటాడుతామని ఆయన ప్రకటించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులతోపాటు వివిధ గ్రామాలకు చెందిన పత్తి రైతులు పాల్గొన్నారు.
రైతులను గోస పెడ్తున్న ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి రైతుల గోస బుచ్చుకుంటున్నాయి. కొత్తగా యాప్ పెట్టారు. యాప్‌లో స్లాట్లు బుక్ కాదు.పత్తిలో తేమ ఉందని తిరస్కరిస్తున్నారు.ఇప్పుడేమో మిల్లుల బంద్ చేసుకున్నారు.పత్తి రైతులను అరిగోస పెడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేరుగా సీసీఐ కేంద్రాల్లో పత్తి అమ్ముకున్నాం. ఇప్పుడేమో అన్ని కొర్రీలు పెడుతున్నారు.దీనికి తోడు వర్షాలు ఎక్కువ కురవడం వల్ల పత్తి తడిసి ముడుచుకుపోయింది.పత్తి తీయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కూలీలకు రేట్లు భారీగా పెరిగాయి. మద్దతుధరకు అమ్ముకుందామంటే అన్నీ కొర్రీలే.. పత్తి సాగుతో తీవ్రంగా నష్టం వచ్చింది.
– కే.శశిపాల్‌రెడ్డి, రైతు, తాండ్ర, కల్వకుర్తి మండలం
షరతులు దారుణం
కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోళ్లకు షరతులు విధించడం దారుణంగా ఉంది. మా రైతులకు ముందస్తు సమాచారం ఇస్తే.. మిల్లుకు ఎవరు రారు. వచ్చిన తర్వాత కొనం అంటే.. మేం ఎక్కడికి పోవాలి. రైతులమంతా వాహనాలను అద్దెకు తీసుకుని వచ్చాం.అందరికీ సొంత వాహనాలుండవు. ఇప్పటికి మిల్లు ముందు బండ్లు నిలిపి మూడు రోజులైంది. బండ్ల కిరాయిలు మీద పడుతున్నాయి. ఇప్పటి వరకు మిల్లుకు వచ్చిన పత్తిని అయినా కొనుగోలు చేయాలి. పంటలు వేసినప్పుడే చెబితే.. వాటికి తగ్గట్టుగా పంటలు పండిస్తాం. పండిన తర్వాత నిబంధనలు పెట్టి రైతులను ఏం చేయాలనుకుంటున్నారు. ఇలాగే వ్యవహరిస్తే.. మళ్లీ రైతులను ఉరికి ప్రోత్సహించినట్లే..
– భరత్ కుమార్‌రెడ్డి, పత్తి రైతు, మానవపాడు, గద్వాల జిల్లా
పత్తి కొనుగోలు స్లాబ్ ఎత్తివేయాలి
సీసీఐ కేంద్రాల ద్వారా పత్తిని కొనుగోలు చేయకుండా రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తాను పండించిన పత్తిని సీసీఐకి తీసుకెళ్తే కొనుగోలు చేయక పోవడంతో లేక ప్రైవేట్ వ్యక్తులకు అమ్మకం చేశాను. అదేవిధంగా ప్రభుత్వం పత్తి కొనుగోలుకు స్లాట్ ఏర్పాటు చేయడం అన్యాయం. ఏడు క్వింటాలకే పరిమితం చేస్తే మిగతా పత్తి పంటను ఎవరికి అమ్మాలి. రైతులను ఇబ్బందులు గురి చేస్తున్న ప్రభుత్వాలకు మా ఉసురు తగులుతుంది.
– అల్లాజీ గౌడ్, రైతు, లింగారెడ్డి పల్లి, వెల్దండ, నాగర్‌కర్నూల్ జిల్లా