నాగర్‌కర్నూల్, మే 31 : తొమ్మిదేండ్లలో జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ప్రజానికానికి తెలియజేయాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేశారు. దశాబ్ది ఉత్సవాలపై బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలెక్టర్ ఉదయ్‌కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, జెడ్పీ చైర్పర్సన్ శాంతకుమారి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి హాజరయ్యారు. జూన్ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అధికారులను ఆదేశించారు. జిల్లాకు ఘనమైన కీర్తి ఉందని, పరిపాలన అద్భుతంగా సాగుతుందని, అనేక విజయాలను సాధించామని.. ఆంధ్రుల పాలనలో గంజి కేంద్రాలు నడిచిన జిల్లాలో ఇయ్యాల స్వరాష్ట్ర పాలనలో పచ్చని పంటలతో కళకళలాడుతున్నట్లు తెలిపారు. నాటి నేటి పరిస్థితులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసి, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకొని ఉద్యోగులు పూర్తిస్థాయిలో భాగస్వామ్యులై విజయవంతం చేయాలని కోరారు.
అభివృద్ధిని వివరించాలి : జెడ్పీ చైర్పర్సన్
జిల్లా పరిషత్ చైర్పర్సన్ శాంతకుమారి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుతో గ్రామాల్లో మారిన రూపురేఖలను, అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. మహిళలకు స్ఫూర్తినిచ్చే కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు.
తెలంగాణ వైభవాన్ని వివరించాలి :ఎమ్మెల్యే బీరం
దశాబ్ది ఉత్సవాలను తూతూ మంతంగా నిర్వహించకుండా.. తెలంగాణ వైభవాన్ని చాటిచెప్పేలా నిర్వహించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 2014కు పూర్వం, 2023 నాటికి సాధించిన ప్రగతిని ప్రజలకు తెలియజేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, జిల్లా అటవీశాఖ అధికారి రోహిత్‌గోపిడి, ఆర్డీవోలు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
కలిసికట్టుగా పనిచేయాలి : కలెక్టర్, ఎస్పీ
జూన్ 2వ తేదీ నుంచి 21 రోజుల పాటు ప్రతి రోజూ ఒక్కో రంగంపై నిర్వహించే దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని తెలిపారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించి ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, నేడు మారిన పరిస్థితులు ప్రజలకు అర్థమయ్యేలా ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ వేడుకలను విజయవంతం చేయాలని తెలిపారు. ఎస్పీ మనోహర్ మాట్లాడుతూ సురక్షా దినోత్సవం రోజు ర్యాలీని ఏర్పాటు చేస్తామని, షీటీమ్, భరోసా, సైబర్ నేరాలు, తెలంగాణ పోలీసుల ప్రతిభ గురించి ప్రజలకు వివరిస్తామన్నారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.