చారకొండ, జూన్ 21 : అపర భద్రాదిగా పేరుగాంచిన సిరుసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయ భూముల్లో ఇండ్లు కోల్పోయిన పేదలు రోడ్డున పడ్డా ప్రభుత్వం కనికరం చూపడం లేదని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ నేత, సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని సిరుసనగండ్ల(అయోధ్యనగర్)లో ఇండ్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. అధికారులు తమను భయభ్రంతులకు గురి చేశారని, ఇండ్లకు కూల్చొద్దని కాళ్లమీద పడినా పక్కకు నెట్టేసి నేలమట్టం చేశారని వాపోయారు.
అధికారులు సమావేశం పెట్టినప్పుడు 25రోజులు సమయం ఇవ్వాలని అడిగినా ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ కోర్టు ఆదేశాలున్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పునరావాసం కల్పించి కూల్చివేస్తే బాగుండేదని చెప్పారు. దేవున్ని నమ్ముకొని జీవనం గడుపుతున్న పేదల గూడును చెదిరగొట్టి రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఇండ్లు కూలిపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నా అధికారులు, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. బాధితులకు పునరావాసం కల్పించి, పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అనంతరం తన సొంత ఖర్చులతో 34 మందికి 25 కేజీల బియ్యంతోపాటు బాధిత కుటుంబాలకు రూ.10వేల చొప్పున అందించి అండగా నిలిచారు. కార్యక్రమంలో మాజీ సర్పంచులు యాతం శారదశ్రీను, సాయికుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రవీందర్, యూత్ ప్రెసిడెంట్ చండీశ్వర్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్యగౌడ్, మాజీ జెడ్పీటీసీ రవితేజ, బీఆర్ఎస్ నాయకులు రమేశ్, సలీం, కమలాకర్‌రావు, శ్రీశైలం, శ్రీను, రాంలాల్, జూమ్లానాయక్, మధు, మహేశ్‌గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.