మహబూబ్‌నగర్ అర్బన్, సెప్టెంబర్ 1 : సమైక్య పాలనలో మరుగున పడిన కులవృత్తులకు పునర్జీవం పోశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని క్రిస్టియన్‌పల్లి బుద్ధ విగ్రహం సమీపంలో 650 గజాల స్థలంలో రూ.25లక్షలతో చేపట్టిన మేదర సంఘం కమ్యూనిటీ భవనం నిర్మాణానికి మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రికి మహిళలు రాఖీ కట్టి ఆశీర్వదించారు. అనంతరం బండ్లగేరి ఓల్డ్ హాస్పిటల్ సమీపంలో ఏర్పాటు చేసిన మేదర సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనగా స్థానికులు క్రేన్ సహాయంతో మంత్రికి భారీ గజమాల వేసి ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక అన్ని కులవృత్తులకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో ఎంతో విలువైన భూముల్లో కులవృత్తులకు భవనాలు నిర్మించామన్నారు. జిల్లా కేంద్రంలోనూ అన్ని కులసంఘాలకు కమ్యూనిటీ భవనాలు నిర్మిస్తున్నామని వివరించారు. గతంలో ఇదే బండ్లగేరి ప్రజలు తాగునీటి కోసం నానా అవస్థలు పడ్డారని.. ఇప్పుడు ఇంటి వద్దకే మిషన్ భగీరథ నీరు వస్తున్నదన్నారు. జిల్లా ప్రజలను ఆకట్టుకునేలా ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్డు, సస్పెన్షన్ బ్రిడ్జి, శిల్పారామం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించుకొని కాల్వల ద్వారా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు. తాను అందరివాడినని.. ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.
మంత్రికి తులాభారం..
మేదర సంఘం జమచేసిన రూపాయి నాణేలతో మంత్రికి తులాభారం వేశారు. తులాభారం నుంచి వచ్చిన ప్రతి రూపాయిని ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డిపాజిట్ కోసం తమవంతు సాయంగా అందిస్తున్నట్లు మేదరులు తెలిపారు. స్పందించిన మంత్రి ఈ కానుక తనకు మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్ రాణిరాజు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రాములు, జిల్లా అధ్యక్షుడు రాములు, పట్టణ అధ్యక్షుడు సత్యం, యువజన సంఘం కార్యదర్శి సుధాకార్, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేట్ తరహా వైద్యం అందిస్తాం..
అన్ని రకాల వ్యాధుల నివారణకు కార్పొరేట్ తరహా వైద్యాన్ని పాలమూరులోనే అందిస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో రూ.18.77లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
అశుర్ఖానా పనులకు శంకుస్థాపన
మహబూబ్‌నగర్ టౌన్, సెప్టెంబర్ 1 : పట్టణంలోని బండ్లగేరి ఓల్డ్ హాస్పిటల్ సమీపంలో రూ.20లక్షలతో చేపట్టిన అశుర్ఖానా(పీర్లమసీదు) పనులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా పట్టణాభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పద్మ, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల సంక్షేమానికి కృషి
మైనార్టీల సంక్షేమానికి సర్కారు కృషి చేస్తున్నదని మంత్రి అన్నారు. మదీనా మసీదులో సమీపంలో ఉన్న మదర్సా-ఏ-అన్వర్ ఉల్ హసనత్ లిల్బనాత్ మదర్సా 23 వార్షికోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 200కు పైగా మైనార్టీ గురుకులాలు, కళాశాలలను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామని గుర్తుచేశారు. జిల్లాలో 6 మైనార్టీ గురుకులాల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేశామని వివరించారు. మదర్సాలో అభివృద్ధి పనులకు రూ.25లక్షలు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో మార్కెట్‌కమిటీ చైర్మన్ అబ్దుల్ రహెమాన్, మదర్సా వ్యవస్థాపకుడు హఫీజ్ ఇలియాజ్, బీఆర్ఎస్ మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు మోసీన్, కౌన్సిలర్ మోయిన్‌అలీ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తి చేయాలి
బ్రిడ్జి విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రి సూచించారు. జిల్లాకేంద్రంలోని భగీరథకాలనీ, భూత్పూర్ రోడ్డు ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద బ్రిడ్జి పనులను ఇటీవలే ప్రారంభించగా మంత్రి శుక్రవారం పరిశీలించి మాట్లాడారు. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, నాయకులు తదితరులు ఉన్నారు.