కర్షక లోకం కది లింది.. సోమ వారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం’.. ‘మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం’పై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఆయా గ్రామాల్లోని రైతు వేదికలే కేంద్రంగా రైతులతో అవగాహన సమావేశాలు జరిగాయి. ఉమ్మడి రాష్ట్ర పాలనలోని కరెంట్ కష్టాలను కర్షకులు గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీతో తమకెన్నడూ ప్రయోజనం చేకూరలేదని, లోవోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలి రైతు కన్నీళ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయని, కరెంటు లేక ఆగమయ్యామని గుర్తు చేశారు. తెలంగాణలో తొమ్మిదేండ్లుగా ఎంతో బాగున్నామని, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న సీఎం కేసీఆర్‌కే తమ మద్దతు అని ప్రకటించారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబ్లాయిపల్లి, హన్వాడలో జరిగిన సమావేశాలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హాజరయ్యారు. కర్షక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వడం లేదనిమండిపడ్డారు. నాడు గురువు చంద్రబాబు, నేడు శిష్యుడు రేవంత్‌రెడ్డి రైతులపై వ్యతిరేక బుద్ధిని బయట పెట్టారన్నారు. ముక్కు నేలకు రాసి రైతులకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. నిన్న ధరణి, నేడు కరెంట్, భవిష్యత్తులో రైతుబంధు, రైతుబీమాను కూడా రద్దు చేస్తామంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం అగ్నిగుండమై కాంగ్రెస్ పార్టీని దహించి వేస్తుందన్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని కరెంట్ విషయంలో కాంగ్రెస్ నేతల తీరును ఎండగట్టారు.
– నెట్వర్క్ మహబూబ్‌నగర్, జూలై 17 (నమస్తే తెలంగాణ)
హన్వాడ, జూలై 17 : కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మొద్దని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కోరారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను ఇస్తున్నామని, మళ్లీ అధికారంలోకి వచ్చే తమ ప్రభుత్వం కూడా నిరంతర విద్యుత్‌ను కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ మాత్రం సాగుకు 3 గంటల విద్యుత్ చాలన్న వ్యాఖ్యలు అర్ధరహితంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో కర్షకులకు కరెంట్‌పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ కర్షకుల కోసం రైతుబీమా, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నారని తెలిపారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రం మరింత ప్రగతి బాటలో పయనించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాల పాలనలో కాంగ్రెస్ రైతులకు ఏం ఒరగబెట్టిందేమో వివరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో రైతులకు వారు చేసింది శూన్యమన్నారు. హస్తం పార్టీ నాయకులు గ్రామాల్లోకి వస్తే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఎన్నికలు దగ్గర పడుతుండగా వివిధ పార్టీల నాయకులు కల్లబొల్లి మాటలు చెప్పేందుకు వస్తున్నారని, వారిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కులాల పేర్లతో ఓట్ల కోసం గ్రామాలకు వివిధ పార్టీల నాయకులు వస్తున్నారని, ఆయా పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రూ.2 వేల పింఛన్, రైతుబీమా, పంట పెట్టుబడి, నిరంతర విద్యుత్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించాలన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఎంత అభివృద్ధి జరిగిందో మీకే తెలుసన్నారు. రూ.కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని, ప్రతిపక్షాల మాటలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, జెడ్పీటీసీ విజయనిర్మల, విండో చైర్మన్, వైస్ చైర్మన్ వెంకటయ్య, కృష్ణయ్యగౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్, ఏపీఎం సుదర్శన్, ఎంపీడీవో ధనుంజయగౌడ్, నాయకులు లక్ష్మయ్య, జంబులయ్య, బసిరెడ్డి, సత్యం, శ్రీనివాసులు, రామణారెడ్డి, సత్యం, చెన్నయ్య, యాదయ్య, జహంగీర్, శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి..
మహబూబ్‌నగర్ అర్బన్, జూలై 17 : సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదన్న కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలని ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. నాడు గురువు చంద్రబాబు, నేడు శిష్యుడు రేవంత్‌రెడ్డి తమ రైతు వ్యతిరేక బుద్ధిని బయట పెట్టారని మంత్రి విమర్శించారు. తక్షణమే ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని, అంతవరకు వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలం ఓబ్లాయిపల్లి రైతువేదికలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వ్యవసాయానికి 3 గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ సోమవారం ఏర్పాటు చేసిన రైతు అవగాహన సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ వల్ల రైతుకు ఎన్నడూ ప్రయోజనం చేకూరలేదన్నారు. వారి పాలనలో కరెంటు లేక రైతు ఆగమైండని గుర్తు చేశారు. లో ఓల్టేజీ వల్ల ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి రైతులు ఇబ్బందులు పడిన విషయాన్ని గుర్తు చేశారు.
నిన్న ధరణి, నేడు కరెంటు, భవిష్యత్తులో రైతుబంధు, రైతుబీమా పథకాలేవీ కాంగ్రెసోళ్లు వద్దంటారన్నారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రమంతా అగ్నిగుండమై కాంగ్రెస్ పార్టీని దహించి వేస్తుందన్నారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. రైతుల కోసం కష్టపడుతున్న తెలంగాణ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రైతులపైనే ఉందన్నారు. గతంలో కరెంటు సమస్యలపై ధర్నా చేస్తే రైతులను కాల్చి చంపిన ఘటనను నేడు నమస్తే తెలంగాణ దినపత్రికలో చదువుతుంటే కండ్లల్లో నీళ్లు తిరిగాయని మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ సుధాశ్రీ, రాజేశ్వర్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ వైస్‌చైర్మన్ గిరిధర్‌రెడ్డి, మూడా డైరెక్టర్ ఆంజనేయులు, వైస్‌ఎంపీపీ అనిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.