గోపాల్పేట, డిసెంబర్ 31 : రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వందేండ్ల కిందటి జాగీర్దార్ కాల్వకు పునర్జీవం పోశామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. నాలుగున్నర కిలోమీటర్ల మేర కాలువ తీసినట్లు చెప్పారు. ఈ కాల్వ నుంచి గోపాల్పేట మండలం బుద్ధారం, పొల్కెపహాడ్, చెన్నూర్‌తో పాటు నాలుగు తండాలు, గోపాల్పేట శివారు రైతులకు సంబంధించి 4 వేల ఎకరాలకు సాగునీరు అందనున్నట్లు తెలిపారు. చుట్టూ నీళ్లున్నా పొలాలకు నీరందక నిరాశతో ఉన్న రైతుల కోరిక మేరకు అడవిలో నీటికి అడ్డుకట్ట వేసి నీటిని సాగుకు మళ్లించినట్లు వివరించారు. ఎత్తయిన ప్రాంతాలకు ప్రత్యేక ప్రణాళికతో సాగునీరు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కాలువ కింద భూమి కోల్పోయిన రైతులందరికీ త్వరలోనే పరిహారం అందిస్తామని భరోసా కల్పించారు. శనివారం గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామ శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన చెన్నూర్ బ్రాంచ్ కెనాల్ (జాగీర్దార్ కాల్వ) నుంచి ఎంజీకేఎల్ఐ సాగునీటిని మంత్రి విడుదల చేశారు. అనంతరం రైతులతో కలిసి మంత్రి అక్కడే భోజనం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సర్కార్ వచ్చాక సాగునీటి రాకతో గ్రామాల్లో మార్పు మొదలైందన్నారు. భవిష్యత్‌లో దేశానికే తెలంగాణ దిక్చూచిలా నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులకే ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకూ సాగునీరు అందిస్తామన్నారు. రైతులు ఆర్థికంగా వృద్ధిలోకి వస్తేనే గ్రామాలు బాగుంటాయని, అందుకే సీఎం కేసీఆర్ వ్యవసాయానికి తొలి ప్రాధా న్యమిచ్చారని తెలిపారు. అందుకే రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌తోపాటు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. వలసవాదులు సొంతూళ్లకు తిరుగుముఖం పట్టారన్నారు.
రైతులతో మాటాముచ్చట
బుద్ధారం శివారులో జాగీర్ధార్ కాల్వ నుంచి సాగునీటిని విడుదల చేసిన మంత్రి నిరంజన్‌రెడ్డి అనంతరం అక్కడున్న వేరుశనగ పంట చేల్లో కూర్చొని రైతులతో ముచ్చటించారు. రైతుబంధు ఖాతాల్లో జమ అవుతుండడం, పంటల సాగుపై అక్కడున్న కర్షకులతో మాట్లాడారు. సర్కార్ అందిస్తున్న సాయంపై సీఎం కేసీఆర్‌కు, మంత్రి నిరంజన్‌రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పటేల్ జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీపీ అడ్డాకుల సంధ్య, బంకల సేనాపతి, జెడ్పీటీసీ మంద భార్గవి, రైతుబంధు సమితి మండల అధ్యక్షులు తిరుపతి యాదవ్, తాసిల్దార్ సునీ త, ఎంపీడీవో హుస్సేనప్ప, డీటీ జాకీర్ హుస్సేన్, ఇరిగేషన్ డీఈ మోహన్, బీఆర్ఎస్ జిల్లా శిక్షణా తరగతుల కోఆర్డినేటర్ మెంటపల్లి పురుషోత్తంరెడ్డి, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ హర్యానాయక్, విండో వైస్ చైర్మన్ గువ్వల రాములు, సర్పంచులు పద్మమ్మ, శ్రీనివాసులు, సాలి, శేఖర్‌యాదవ్, శంకర్‌నాయక్, ఎంపీటీసీ శ్రీదేవి, కో ఆప్షన్ సభ్యులు మతీన్, నాయకులు పాల్గొన్నారు.