– దేవాలయానికి రూ. 42.73 లక్షల ఆదాయం
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 18 : ఖమ్మం జిల్లా రూరల్ మండలం తీర్థల గ్రామంలో నాలుగు రోజుల పాటు కొనసాగిన శ్రీ సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవాలు బుధవారంతో ముగిశాయి. శనివారం ప్రారంభమైన మహాశివరాత్రి శ్రీ సంగమేశ్వర స్వామి జాతర మహోత్సవాలు ఒక్కో రోజున ఒక్కో రీతిన స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించిన అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదివారం అర్ధరాత్రి శివపార్వతుల కల్యాణం ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ తదితర ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు. చివరి రోజున ఆనవాయితీ ప్రకారం తీర్థాల గ్రామంలో అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామ పుర వీధుల్లో దోపు ఉత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ భాగస్వాములై స్వామివారి ఊరేగింపులో పాల్గొనడం జరిగింది. అనంతరం దేవాలయ ప్రాంగణంలో హుండీలు, అభిషేకాలు, ఇతరత్రా మార్గాల ద్వారా చేకూరిన ఆదాయాల లెక్కింపును చేపట్టారు. నాలుగు రోజులపాటు జరిగిన జాతర మహోత్సవాలను పురస్కరించుకుని దేవాలయానికి రూ.42,73,392 ఆదాయం సమకూరినట్లు దేవాలయం శాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం రూ.39.97 లక్షల ఆదాయం రాగా ఈ సంవత్సరం రూ.42.73 లక్షల ఆదాయం సమకూరినట్లు పేర్కొన్నారు.

ముగిసిన తీర్థాల సంగమేశ్వర స్వామి జాతర