Komal Kumari : పరీక్షలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతించకపోవడం అనే రూల్ చాలా మంది విద్యార్థుల ప్రాణాల్ని బలిగొంది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ రూల్ అమలవుతుండగా, దీనివల్ల చాలా మంది విద్యార్థులు నష్టపోయారు. కొందరు పరీక్ష రాసే అవకాశం కోల్పోతే, ఇంకొందరు ప్రాణాలే తీసుకున్నారు. తాజాగా బిహార్ రాజధాని పాట్నా పరిధిలో ఈ నిబంధన కారణంగా పదో తరగతి విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన పాట్నాలోని, మాసౌర్హి పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహారాజ్ చక్ గ్రామానికి చెందిన కోమల్ కుమారి అనే పదో తరగతి విద్యార్థిని మంగళవారం ఉదయం బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు ఆరు కిలోమీటర్ల దూరంలోని పరీక్ష కేంద్రానికి వెళ్లింది. పరీక్షకు ఉదయం తొమ్మిదింటివరకే అనుమతిస్తారు. కానీ, కోమల్ కుమారి 9.10-9.15 గంటల మధ్యలో అక్కడికి చేరుకుంది. అప్పటికే దాదాపు పది నిమిషాలుపైగా ఆలస్యం అయింది. దీంతో కుమారిని పరీక్షకు అనుమతించలేదు. దీనిపై కుమారి అధికారులను ఎంతో బ్రతిమిలాడింది. అయినా రూల్స్ పేరుతో కుమారిని పరీక్ష రాయడానికి పంపించలేదు. నిజానికి పరీక్ష ప్రారంభమయ్యేది 9.30 గంటలకు. అంటే పరీక్షకు ఇంకో పావుగంట ఉంది. దీంతో ఆమె అధికారుల్ని ఎంతో వేడుకుంది. పరీక్షకు ఇంకా సమయం ఉందని, తన కెరీర్‌కు ఈ పరీక్షలు చాలా కీలకం అని, తాను పది నిమిషాలు మాత్రమే లేటుగా వచ్చానని, ఎలాగైనా అనుమతించాలని కోరింది.
కానీ, అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. గేట్లు ఓపెన్ చేయలేదు. చాలాసేపు బ్రతిమిలాడినా ప్రయోజనం లేకపోవడంతో నిరాశగా వెనుదిరిగింది. తర్వాత ఇంటికి బయల్దేరిన కుమారి, అక్కడి నుంచి తరెంగా-మాసౌర్హి మధ్య ప్రయాణించే రైలు ఎక్కింది. అప్పటికే తీవ్ర వేదన, నిరాశలో ఉన్న కుమారి వేగంగా వెళ్తున్న రైలు నుంచి కిందికి దూకేసింది. ఈ ఘటనలో కుమారి తీవ్రంగా గాయపడగా స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.