
భూత్పూర్, డిసెంబర్ 12: రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి సాగునీటిపై దృష్టిసారించానని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి మూడేండ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పథకాల్లో ప్రతిష్టాత్మకమైన మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, ఆసరా పింఛన్లను అర్హులకు అందజేయడంలో అధికారుల సమన్వయంతో అందజేశామన్నారు. అదేవిధంగా జిల్లాకే తలమానికంగా భావించే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు 80 పనులు పూర్తయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా నియోజకవర్గంలో సాగునీరు అందించేందుకు 21చోట్ల రూ.170కోట్ల వ్యయంతో చెక్‌డ్యాంలను నిర్మించి సాగునీటిని దేవరకద్ర, చిన్నచింతకుంట, మదనాపురం, కొత్తకోట, అడ్డాకుల, మూసాపేట మండలాలకు పుష్కలంగా అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఈ మండలాల్లో తాగడానికి కూడా నీళ్లు దొరికేవి కాదని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక తాగునీటితోపాటు సాగునీటి కొరత తీర్చినట్లయిందని తెలిపారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కర్వెనలో పూర్తిచేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనులకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అడ్డం పడ్డందుకే కొంత ఆలస్యం అయినందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలో మరో 16 చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేసినట్లు ఆయన తెలిపారు. త్వరలోనే అవి కూడా మంజూరవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 1,340 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించగా, మరో 1,500 ఇండ్లను మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే ఆల తెలిపారు. రూ.100కోట్లతో నియోజకవర్గంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టినట్లు తెలిపారు. దేవరకద్ర మండలంలోని పేరూర్ లిఫ్టు నిర్మాణానికి రూ.50కోట్ల అవసరమని ప్రణాళికలు సిద్ధం చేసి పంపినట్లు ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ఇంతకాలం అధికారంలో ఉండి గ్రామాల్లో ఏం అభివృద్ధి చేసిందో ఆ పార్టీ నాయకులను అడగాలని ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి ఇంకా వేగంగా అయ్యేది, ప్రపంచాన్నే అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి కొంతవరకు దెబ్బ తీసిందన్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే వచ్చే రెండేండ్లలో అభివృద్ధి పనులు మరింత వేగంగా జరుగుతాయన్నారు. సీఎం కేసీఆర్, మంత్రుల సహకారంతో నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్తూర్ నారాయణగౌడ్, యువత విభాగం నాయకులు గడ్డం ప్రేమ్‌కుమార్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.