సిటీబ్యూరో, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ) : హెచ్ఎండీఏ ఆధీనంలోని డా. జీఎస్ మేల్కోటే పార్క్ టెండర్ల విషయంలో వివాదం నెలకొంది. పార్క్‌లోని జిమ్, స్విమ్మింగ్ పూల్ నిర్వహణ పనులు మూడేండ్ల కాలానికి అప్పగించేందుకు 2025 ఆగస్టు 19న టెండర్లను ఆహ్వానించింది. అయితే ఇందులో పొందుపర్చిన నిబంధనల విషయంలో వివాదం తలెత్తింది. ఆ పార్క్ నిర్వహణ చరిత్రలో ఎన్నడూ లేనంతగా సంబంధిత కంపెనీల టర్నోవర్‌ను రూ. 15కోట్లుగా పేర్కొనడంపై అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు ఎందుకు ఈ స్థాయిలో టర్నోవర్ పెరిగిందనే అంశాన్ని ఆరాతీయడంతో… వివాదం వెలుగులోకి వచ్చింది.
గతంలో ఈ పార్క్‌ను నిర్వహించిన సమయంలో ఏడాదికి రూ. 27 లక్షల చొప్పున లైసెన్స్ జారీ చేసిన హెచ్ఎండీఏ ఎందుకు ఒకేసారి రూ. 15కోట్ల టర్నోవర్ అంశాన్ని చేర్చిందంటూ, ఇందులో పలు బడా కంపెనీలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ విధంగా నిబంధనలు మార్చినట్లుగా ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. అయితే ఒక్కసారిగా నిబంధనల్లో పెద్ద మొత్తంలో టర్నోవర్ పెంచడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకు ఈ స్థాయిలో టర్నోవర్ అంశాన్ని చేర్చారనే విషయంతో పాటు, కేవలం ఉన్నతాధికారులకు లబ్ధి చేకూర్చేలా ఈ నిబంధన చేరిందనే చర్చ నడుస్తున్నది. దీనిపై కోర్టును ఆశ్రయించడంతో అసలు వివాదం తెరమీదకు వచ్చింది.
ప్రస్తుతం ఈ టెండర్లు పూర్తి చేసి ఆరు నెలలు గడిచింది. అయితే ఈ వివాదం కొనసాగుతుండగానే… టెండర్ల ఎంపిక కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు ఆ టెండర్ విషయంలో హెచ్ఎండీఏ ఏ చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి ఆదేశాలు రాలేదని, హైకోర్టు ఇచ్చే ఉత్తర్వులకు అనుగుణంగా చర్యలు ఉంటాయని ఓ అధికారి పేర్కొన్నారు. అవసరమైతే టెండర్లను రద్దు చేసే అధికారం కూడా ఉంటుందని పేర్కొన్నారు.