పెనుబల్లి (కల్లూరు), ఫిబ్రవరి 9: అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి మోసాలు, అక్రమాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధి హనుమాతండా, గన్యాతండా, కల్లూరు పురవీధులు, సెంటర్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోరుతూ సోమవారం ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు.
సెంటర్ కార్నర్ మీటింగ్‌లో సండ్ర మాట్లాడుతూ రైతుల పంటలకు యూరియా కట్టలు అందించలేని ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తారంటే ఎలా నమ్ముతారని, వారి అబద్ధపు మాటలను ప్రజలు గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి తప్ప కల్లూరులో ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదని, చేసిందంతా కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి బీఆర్ఎస్ అభ్యర్థుల కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తండాలను గుర్తించి ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు స్వపరిపాలన అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు. మున్సిపాలిటీలో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని, దీనికి సబ్బండ వర్గాల ప్రజలు మద్దతు పలకాలని ఆయన కోరారు. మండల పార్టీ అధ్యక్షుడు పాలెపు రామారావు, మాజీ జడ్పీటీసీ కట్టా అజయ్‌కుమార్, సీనియర్ నాయకులు లక్కినేని రఘు, ఆయా వార్డుల అభ్యర్థులు. పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.