సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మహా నగర జనాభా దాదాపు 1.34 కోట్లకు చేరుకున్న నేపథ్యంలో ప్రజలకు పౌర సేవలను మరింత వేగవంతంగా అందించేందుకు జీహెచ్ఎంసీని మూడు వేర్వేరు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించే దిశగా కసరత్తు పూర్తి చేసింది. ప్రతిపాదిత విభజన స్వరూపాన్ని పరిశీలిస్తే జీహెచ్ఎంసీ (హైదరాబాద్) పాత నగరంతో పాటు ప్రధాన నగర ప్రాంతాల్లోని 6 జోన్లు దీని పరిధిలోకి రానున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, గోలొండ, శంషాబాద్, రాజేంద్రనగర్‌లను కలుపుకొని జీహెచ్ఎంసీగా ఏర్పాటు చేయనున్నారు. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్భుల్ల్లాపూర్ జోన్లు కలిపి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడే అవకాశం ఉంది. మలాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్ జోన్లతో మల్కాజిగిరి లేదా లష్కర్ కార్పొరేషన్‌గా ఏర్పాటయ్యే సూచనలున్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తొలుత స్పెషల్ సీఎస్ స్థాయి అధికారిని నియమించి, మూడు కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Ghmc
రేపటి నుంచి ప్రత్యేక పాలన
గ్రేటర్ హైదరాబాద్ పాలనలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత పాలక మండలి ఐదేండ్ల గడువు మంగళవారం (ఫిబ్రవరి 10)తో పూర్తి కావొస్తుండటంతో బుధవారం (ఫిబ్రవరి 11) నుంచి గ్రేటర్ ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నది. కాగా, పదేండ్ల తర్వాత మళ్లీ ప్రత్యేక పాలన కొనసాగనున్నది. గతంలో 2009 నుంచి 2014 మార్చి వరకు కార్పొరేషన్లో ప్రత్యేక అధికారుల పాలన సాగింది. స్పెషల్ ఆఫీసర్‌గా సోమేశ్‌కుమార్, జనార్దన్‌రెడ్డి కొనసాగారు. 2016లో ఎన్నికల తర్వాత సరిగ్గా పదేండ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి నెలకొననున్నది. విభజన నిర్ణయం ఖరారైతే, ఒకో కార్పొరేషన్‌కు ప్రత్యేక అధికారులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఇప్పటికే ఉన్న జోనల్ అదనపు కమిషనర్లకు అదనపు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.