అలంపూర్ చౌరస్తా, నవంబర్ 11 : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను అమ్ముకుందామంటే అధికారుల నిర్లక్ష్య వైఖరి ఏంటని సీసీఐ అధికారులపై ఎమ్మెల్యే విజయుడు ఆగ్రహించారు. మంగళవారం ఉండవెల్లి మండలంలోని శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లులో ఆయన సందర్శించి రైతుల సమస్యలపై ఆరా తీశారు. కాటన్ మిల్లు దగ్గరికి ఎమ్మెల్యే విజయుడు రాగానే రైతులు వచ్చి పత్తి కొనడం లేదని, వాహనాలను వెనక్కి పంపుతున్నారని ఆయన ముందు గోడు చెప్పుకున్నారు. దీంతో ఎమ్మెల్యే సీసీఐ అధికారుల దగ్గరికి వెళ్లి ఎందుకు పత్తిని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు.
వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వారికి హక్కు లేదా అని అన్నారు. పొల్లాలో పనులు చేస్తే మీకు వారి కష్టాలు తెలుస్తాయని ఇక్కడ ఉండి రైతులు ఇబ్బందులు పెడితే ఏం తెలుస్తుందని అధికారులపై మండిపడ్డారు. భారీ వర్షాల వల్ల పంట పొల్లాలో సరైన దిగుబడి లేదని వచ్చిన పంటను అమ్ముకుందామంటే మీ నింబంధనలు ఏమిటని వారిపై ఆగ్రహించారు. వర్షాలకు పంట లు దెబ్బతిన్నా ప్రభుత్వం రైతులవైపు కన్నేత్తికూడా చూడటం లేదని, దీనికి తోడు మీ పెత్తనంతో రైతులు నట్టేట మునుగుతున్నారని అన్నారు.
అలంపూర్ నియెజకవర్గం నుంచి వేలాది మంది రైతులు పత్తి పంటను సాగు చేశారు. వర్షాల వల్ల పంటలు చేతికి రాకపోవడంతో రూ.లక్షలు అప్పులు చేసి రాత్రింబవళ్లు కష్టం చేసి పంటలను బతికించుకున్న సరైన దిగుబడి లేక వచ్చిన పంటను కిరాయిలు వాహనాల్లో మిల్లు దగ్గరికి వస్తే సీసీఐ అధికారులు మాత్రం తేమశాతం ఎక్కువ ఉందని, పత్తి నల్లగా ఉందని కొర్రీలు పెట్టి వాహనాలు వెనక్కి పంపడంతో వాహనాల కిరాయిలు, కూలీలకు కూలి డబ్బులు కూడా రైతులకు దక్కడం లేదని, అధికారులు ఇలా వ్యవహరిస్తే రైతులు ఎలా బతకాలని నిలదీశారు. నింబంధనల పేరిట మీరు కొనరు, మరి రైతులు పత్తిని ఎక్కడ అమ్ముకోవాలి చేప్పాలని సీసీఐ అధికారులను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
దళారుల వ్యవస్థ నిర్మూలిస్తాం, రైతులకు మద్దతు అందిస్తామని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు గొప్పలు చెబుతున్నారే తప్పా రైతులకు ఎక్కడ న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన మాటలు పరిపాలనలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. పేరుకే హామీలు ఇవ్వడం తప్పా ప్రభుత్వానికి హామీలు అమలు చేయడంలో ఎలాంటి శ్రద్ధ లేదన్నారు. భారీ వర్షాలతో పంటలు మొత్తం నాశనమవవుతున్నా రైతులను ఆదుకోవడం లేదని, వ్యవసాయన్నే నమ్ముకున్న రైతన్న ఎక్కడికి వెళ్లాలని అన్నారు. రైతులను ఇబ్బందులు పడితే మాత్రం సహించేది లేదని, ప్రతి రైతు వద్ద ఎంత ఉంటే అంత పత్తిని మొత్తం సీసీఐ అధికారులు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నింబంధనల పేరుతో రైతులను ఇబ్బందులు పేడితే చర్యలు తప్పవని సీసీఐ అధికారులను హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, రైతులు ఉన్నారు.