మరికల్, డిసెంబర్ 12 : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టు కోయిల్‌సాగర్ కాల్వలకు మహర్దశ పట్టనుంది. కోయిల్‌సాగర్ కుడి, ఎడమ కాల్వల మరమ్మతులు, కాల్వ వెడల్పు , లైనింగ్ పనుల కోసం గత ఏడాది రూ.52 కోట్లు మంజురు కాగా పనులు 50 శాతం వరకు పూర్తయ్యాయి. మొత్తం రూ.52 వేల ఎకరాలకు సాగు నీరు అందించే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం పాత కాల్వల మరమ్మతులతోపాటు, మరికల్, నర్వ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న నూతన కాల్వల ఏర్పాటుకు జలవనరు లశాఖ అధికారులతో నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రా జేందర్‌రెడ్డి, దేవర్కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మా ట్లాడి వచ్చే వానకాలం సీజన్లో పూర్తి స్థాయిలో 52 వేల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో మరో 30 కోట్ల నిధులు తీసుకొచ్చారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వ ల మరమ్మతు పనులు ప్రారంభమై 50 శాతం పనులు పూర్తయ్యాయి. కుడి కాల్వ మొత్తం 12కిలోమీటర్లకుగా నూ ప్రస్తుతం 5 కిలోమీటర్ల వరకు కాల్వ మరమ్మతులు పూర్తయ్యాయి.
కాల్వ విస్తీర్ణం పెంచడంతోపాటు తూముల మరమ్మతులు, కాల్వ లైనింగ్ పనుల నిమిత్తం ఇప్పటికే కుడి కాలువకు రూ.31కోట్లు, ఎడమ కాల్వ పనులకు రూ.27 కోట్లు మంజూరు కావడంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఎడమ కాల్వ మొత్తం 28.3 కిలోమీటర్లకుగానూ 15.5 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ఎడమ కాల్వ పనులు 60శాతం పూర్తయ్యాయి. ఇంకా భూ సేకరణ పనులు జురుగుతుండడంతో మిగతా పనులు యాసంగి పంటలకు కోయిల్‌సాగర్ నుంచి నీరు విడుదల చేయకుండా కాలువల మరమ్మతు చేపట్టాలని రైతులు విజ్ఞప్తి చేయడంతో కాల్వ లైనింగ్ పనులు చకచకా సాగేలా ఆధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది పంటలకు నీరు విడుదల చేయడంతో పనులు ఆసంపూర్తిగా మిగలగా ఈ సీజన్ పూర్తయ్యేనాటికి పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యేలు ఆధికారులను ఆదేశాంచారు. మరికల్, నర్వ మండలాల్లో పెండింగ్‌లో ఉన్న నూతన కాల్వల ఏర్పాట్లకుగాను రూ.30 కోట్లు మంజురయ్యాయని ఎమ్మెల్యేలు తెలిపారు. కాల్వ పనులు చేపడితే కోయిల్‌సాగర్ ఆయకట్టు కింద మొత్తం 52వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. పాత కాల్వల మరమ్మతు కూడా చేపట్టడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూన్నారు.
నీటి వృథాను ఆరికట్టవచ్చు
కోయిల్‌సాగర్ కాల్వ లైనింగ్ పనులు చేపట్టడంతో నీటి వృథాను ఆరికట్టవచ్చు. గతంలో రైతులు నీళ్లు సరిగా రాక కాల్వలకు గండ్లు కొట్టే వారు. . లైనింగ్ పనులు పూర్తికావడంతో కాల్వల్లో నీరు సాఫీగా తూముల ద్వారా పంట పొలాల్లోకి పోతాయి. దీంతో గండ్లు కొట్టకుండా చాలా వరకు నీటి వృథా తగ్గుతుంది.
తూముల మరమ్మతులతో మేలు
కాల్వ మరమ్మతు పనులు, తూముల మరమ్మతులు చేయడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది. గతంలో రైతులు తూమలు తెరిచి నీరు వృథా చేసేవారు. నూతనంగా తూములు మరమ్మతు చేయడం వల్ల ఆయకట్టు చివరి పొలాల కు నీరు వెళ్ల్లేందుకు ఆవకాశం ఏర్పడుతుంది. ఎమ్మెల్యే ఎస్రాజేందర్ రెడ్డి చొరవతో కాల్వల పనులు జరుగుతున్నాయి.
-విష్ణుకాంత్‌రెడ్డి, పుసల్పాడ్
చెరువులకు నీరు అందుతుంది
గతంలో కొన్ని గ్రామాల చెరువులకే నీరు వచ్చేది. కోయిల్ సాగర్ కాల్వల మరమ్మతుపనులు చేపట్టడంతో అన్ని గ్రామాల చెరువులు నింపుకొనే అవకాశం ఏ ర్పడుతుంది. పాత కాల్వ ల్లో ఉన్న కంపచెట్లు, పూడి క తొలగించడంతోపాటు నూతనంగా కాల్వలను ఏర్పాటు చేయడం వల్ల మరికల్, నర్వ మండలా ల రైతులకు మేలు జరుగుతుంది.
-కృష్ణారెడ్డి, అప్పంపల్లి గ్రామం