బిజినేపల్లి : రైతులు పంటలు పండించడంలో నీటిని తగినంత మోతాదులో వాడడం వల్ల నీటిని సంరక్షించడమే కాకుండా, పంట దిగుబడి కూడా పెరుగుతుందని శాస్త్రవేత్త కడ సిద్ధప్ప ( Kada Siddappa ) అన్నారు. బుధవారం మండలంలోని వడ్డేమాన్ గ్రామం రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు (Scientists) ,అన్నదాతల అవగాహన కార్యక్రమాన్ని వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగులో ఆధునిక పద్దతి వాడాలని సూచించారు. పొలం గట్ల మీద చెట్లను నాటి వాటిని సంరక్షించాలన్నారు. దీనివల్ల పర్యావరణాన్ని రక్షించడమే ( Environment Protect ) కాకుండా నేల కోతను తగ్గించవచ్చని పేర్కొన్నారు. విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల విత్తనాల ద్వారా వృద్ధి చెందే చీడపీడలు నివారించవచ్చన్నారు. రసాయనాలు, విత్తనాలను లైసెన్సులు ఉన్న డీలర్ల వద్దనే కొనుగోలు చేసి రసీదును భద్రపరచుకోవాలన్నారు. అనంతరం మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉమామహేష్, మధు, రైతులు ఉన్నారు.