అయిజ, డిసెంబర్ 7 : ఈ ఏడాది యాసంగి పంటల సాగుకు నీటి విడుదలపై ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, నెట్టెంపాడ్, ఆర్ఎల్ఐఎస్ లిప్టు – 2, ఎంజీకేఎల్ఐఎస్కు నీటి కేటాయింపులు జరుపుతూ తెలంగాణ ఇంజినీర్ ఇన్ చీఫ్ మహమ్మద్ అంజద్ హుస్సేన్ జీవో విడుదల చేశారు. 2025 – 26 యాసంగి యాక్షన్ ప్లాన్లో భాగంగా నీటి కేటాయింపులు జరిపేందుకు ఈ నెల 3న హైదరాబాద్లోని ఎర్రమంజిల్లోని జలసౌధలో మొదటి ఎస్సీఐడబ్ల్యూఎం కమిటీలో యాసంగి సాగుకు అవసరమైన నీటి విడుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఉమ్మడి జిల్లాల సీఈలు, ఎస్ఈలు, ఈఈలతో ఈఎన్సీ సమావేశం నిర్వహించారు.
ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లోని అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై ఆరా తీశారు. ప్రస్తుతం ఉన్న నీటి నిల్వల ఆధారంగా ఏఏ రకాల పంటలకు సాగునీరు అందించగలమో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. జూరాల ప్రాజెక్టు కింద 20,014 ఎకరాల ఆరుతడి, 6,910 ఎకరాల వరి, నెట్టెంపాడ్ ఎత్తిపోతల పత కం కింద 22,800ఎకరాల ఆరుతడి, ఆర్బీఎల్ఐఎస్ లిప్టు – 2 కింద 5,350 ఆరుతడి, 4,650 ఎకరాల వరి, ఎంజీకేఎల్ఐఎస్ కింద 28,739ఆరుతడి, 13,458ఎకరాల వరి పంటలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. యాసంగి పంటలకు 12టీఎంసీల నీరు వినియోగించాలని ఖరారు చేశారు. యాసంగిలో 76,903 ఎకరాల ఆరుతడి, 25,018 ఎకరాల వరి పంటలకు సాగునీరు అందనుంది. మొత్తం 1,01,921 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయనున్నారు. అయితే కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు తగ్గుతుండడంతో ఈ ఏడాది ఆర్డీఎస్ ఆయకట్టుకు యాసంగిలో ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది. దీంతో ఆర్డీఎస్ ఆయకట్టు పరిధిలోని 87,500 ఎకరాలకు సాగునీరు అందకుండా పోతోంది.
ఈ ఏడాది యాసంగి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. వానకాలంలో అధిక వర్షా ల కారణంగా పంటలు దెబ్బతిని కనీసం పెట్టుబడులు కూడా చేతికందక పోవడం, పండిన పంటలకు గిట్టుబా టు ధరలు లేక రైతులు దళారులకు పంటలు విక్రయించి తీవ్రంగా నష్టపోతున్నారు. ఆశించిన మేరకు దిగుబడులు రాక కొందరు రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. కనీసం యాసంగిలోనైనా పంటలు సాగు చేసి పె ట్టుబడులు మిగిల్చుకుందామనుకున్న రైతులకు ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ రైతుల పాలిట శాపంగా మారింది.
యాసంగిలో ఆరుతడి పంటలకు ప్రాధాన్యత కల్పించడంతో వరి సాగు చేస్తున్న రైతులు నష్టపోయే అవకాశం ఉన్నది. ఈ ఏడాది వానకాలంలో వర్షాలు భారీగా కురిసినా ప్రాజెక్టుల్లో నీటి మట్టం పెంచడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లోని ఆయకట్టుకంతటికీ ఆరుతడితోపాటు వరి సాగుకు నీళ్లందించాలని ఉమ్మడి జిల్లా రైతులు కోరుతున్నారు.