అయిజ, నవంబర్ 9 : కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వలు క్రమేపీ తగ్గుముఖం పడుతున్నాయి. ఎగువన వర్షాలు కురవడకపోవడంతో ఇన్‌ఫ్లో స్వల్పంగా చేరుతోంది. ఆదివారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 2,150 క్యూసెక్కులు ఉండగా, అవుట్‌ఫ్లో 8,537 క్యూసెక్కులుగా ఉన్నది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన డ్యాంలో ఈ ఏడాది 80టీఎంసీలకు మించి నీటి నిల్వ చేయలేదు. గతేడాది ఆగస్టులో డ్యాం 19వ గేటు వరద ధాటికి కొట్టుకుపోవడంతో ఇంజినీరింగ్ నిపుణుల సూచనల మేరకు ప్రాజెక్టులోని 33గేట్లను మార్చాలని సూచనలు చేశారు.
అందుకనుగుణంగా డ్యాంలో నీటి నిల్వలు 80 టీఎంసీల వరకు ఉంచారు. ప్రతి యేటా కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లోని ఆయకట్టుకు సాగు, తాగునీటిని వేసవి వరకు విడుదల చేసేవారు. ప్రస్తుతం డ్యాంలో నీటి నిల్వలు రోజురోజుకు పడిపోతుండటంతో యాసంగి పంటలకు సాగునీరు అందించలేమని టీబీ బోర్డు ఇంజినీర్లు కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ర్టాల ఇంజినీర్లకు సూచనలు చేశారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో నీటి నిల్వ 78.073 టీఎంసీలు ఉండగా, నీటి సామర్థ్యం 1652.48 అడుగులుగా ఉన్నది. ఇదిలా ఉండగా, ఆర్డీఎస్ ఆనకట్టలో నీటిమట్టం 9.1 అడుగులకు చేరుకున్నది.
వర్షాలు తగ్గుముఖం పడుతుండటంతో వానాకాలం పంటల సాగుకు ఆర్డీఎస్ ఆయకట్టుకు కేటాయించిన 5.15 టీఎంసీల నీటిని వచ్చే నెల వరకు వినియోగించే అవకాశం ఉందని ఆర్డీఎస్ అధికారులు చెబుతున్నారు. ఆర్డీఎస్ ఆయకట్టుకు 15.9 టీఎంసీల నీటి కేటాయింపులు ఉండగా, వరద జలాలు మినహాయించి, 5.15 టీఎంసీలు ఈ ఏడాది కేటాయించారు. వచ్చే నెల 20 వరకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుందని ఆర్డీఎస్ అధికారులు వెల్లడించారు.