మక్తల్, జూన్ 16 : పాలకుల నిర్లక్ష్యం, నీటిపారుదల శాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో అన్నదాతల ఆశలు ఆవిరి అవుతున్నాయి. రిజర్వాయర్ల గేట్లకు వేసవిలో మరమ్మతులు చేయకుండా వానకాలంలో పనులు ప్రారంభించడంతో నీటి పంపింగ్‌కు బ్రేక్ పడింది. దీంతో సాగు సందిగ్ధంలో పడునున్నది. అధికారుల నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారే అవకాశం లేకపోలేదు.
మక్తల్ నియోజకవర్గ ప్రజల కలల స్వప్నమైనటువంటి చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, భూత్పూర్ రిజర్వాయర్లను వానకాలంలో కృష్ణానదికి వచ్చే వరద నీటితో నింపి నియోజకవర్గంలోని రైతులకు సాగునీరు అందించాలని లక్ష్యంతో రాజీవ్ ఎత్తిపోతల పథకం కింద భీమా ఫేజ్ వన్‌లో నిర్మించారు. మక్తల్ మండలం సంగం బండ పెద్దవాగుపై చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను 50శాతానికి పైగా వరద నీరు, 40శాతం కృష్ణా జలాలను ఎత్తిపోసి రిజర్వాయర్‌ను నింపాలనే లక్ష్యంతో నిర్మించారు.
చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను 3.313 టీఎంసీల సామర్థ్యంతో 64,200 ఎకరాలకు సాగునీరు అందించాలని సంకల్పంతో నిర్మించారు. రిజర్వాయర్ కిందలో లెవెల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ పరిధిలో 59వేల ఎకరాలు, లో లెవెల్ రైట్ మెయిన్ కెనాల్ కింద పదివేల ఎకరాలు, హై లెవెల్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ కింద 29,900 ఎకరాలు, హై లెవెల్ రైట్ మెయిన్ కెనాల్ కింద 18,400 ఎకరాలకు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించాలనే లక్ష్యంతో అధికారులు రూపొందించారు.
ప్రతి ఏడాది రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి, కర్ణాటక రాష్ట్రం గుర్మిట్కల్ పెద్దవాగు నుంచి వచ్చే వరదతోపాటు కృష్ణానది నుంచి, మక్తల్ మండలం చిన్న గోపులాపూర్ స్టేజ్ వన్ పంప్ హౌస్ నుంచి కృష్ణ వరద నీటిని పంపింగ్ చేసి, మక్తల్‌లోని స్టేజ్ టూ పంప్ హౌస్‌తో చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని నింపే ప్రక్రియను చేపట్టేవారు. మక్తల్ మండలం భూత్పూర్ గ్రామం వద్ద 1.313టీఎంసీల సామర్థ్యంతో భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. ఈ రిజర్వాయర్ కింద 46,800 ఎకరాలకు సాగునీరు అందించేందుకు రిజర్వాయర్ రూపకల్పన చేశారు. గత రెండేండ్ల నుంచి రిజర్వాయర్లకు నీటిని నింపే ప్రక్రియను ఇటు నీటిపారుదల శాఖ అధికారులు, అటు పాలకులు పట్టించుకోవడం లేదు. దీంతో అన్నదాతలు అవస్థలు పడుతున్నారు.
చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 10గేట్లు పూర్తిస్థాయిలో దెబ్బ తిన్నప్పటికీ వాటికి వేసవిలో మరమ్మతులు చేపట్టకుండానే కృష్ణానదికి వచ్చే వరద నీటి నుంచి జలాశయాన్ని నింపడానికి మంత్రి వాకిటి శ్రీహరి జూన్ 6వ తేదీన చిన్న గోపులాపూర్ వద్ద స్టేజి వన్ పంప్ హౌస్ నుంచి పంపిణీ ప్రారంభించారు.
వర్షాలు బాగా కురిస్తే రిజర్వాయర్‌కు భారీ స్థాయిలో ఎగువ నుంచి వరద వచ్చే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు భావించి పంపింగ్ ప్రారంభించిన రెండు రోజులకే పంపింగ్‌ను నిలిపివేసి గేట్ల మరమ్మతు పనులను ప్రారంభించారు.
కృష్ణానదికి వరద వస్తున్న సమయంలో 45రోజులు నీటిని ఎత్తిపోసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, అధికారుల నిర్లక్ష్యం వల్ల రిజర్వాయర్లకు నీటి పంపింగ్ నిలిపివేసే పరిస్థితి వచ్చిందని నియోజకవర్గంలోని రిజర్వాయర్ ఆయకట్టు రైతులు వాపోతున్నారు. గతనెల 30వ తేదీనే భీమా నదికి భారీ స్థాయిలో వరద రావడం, కృష్ణా నదికి వరద పోటేత్తుతుండడంతో ఈ ఏడాది ముందస్తుగానే రెండు రిజర్వాయర్లకు వరద వచ్చి చేరుతుందని రిజర్వాయర్ ఆయకట్టు రైతులు ఎంతో సంతోషంతో ఉన్నప్పటికీ వారి సంతోషం ఆవిరి అయిపోయిందని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతోనే రిజర్వాయర్ల గేట్ల మరమ్మతు పనులు ముందస్తుగా చేపట్టకుండా వర్షాకాలంలో చేపడుతుండడం వల్ల రిజర్వాయర్లకు నీటిని నింపుకొనే పరిస్థితి లేకుండా పోయిందని రైతన్నలు వాపోతున్నారు.
మక్తల్ మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్‌ను పూర్తిస్థాయిలో కృష్ణ వరద జలాలతోనే నింపాల్సి ఉన్నప్పటికీ నీటిపారుదల శాఖ అధికారులు ఇవేవీ పట్టించుకోవడం లేదు. భూత్పూర్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్‌కు నీటిని వదిలే గేట్లు మరమ్మతు చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులకు వేసవిలో చేపట్టకుండా నీటి పంపింగ్ ప్రారంభించిన సమయంలో మరమ్మతులు చేపట్టడం ఎంతవరకు సమంజసం అని రైతన్నలు వాపోతున్నారు.
భూత్పూర్ రిజర్వాయర్ ఆయకట్టు 46,800ఎకరాల్లో వానకాలం సీజన్లో రైతన్నలు పంట సాగు చేసుకోవాలా లేదా అనే ప్రశ్నార్థకంగా మారింది, నీటిపారుదల శాఖపై ఇటు పాలకులు, అటు ఉన్నతాధికారుల పర్యవేక్షణలేకపోవడం వల్లనే రిజర్వాయర్ గేట్ల మరమ్మతులు నోచుకోలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి రిజర్వాయర్లకు నీటి విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరుతున్నారు.
మక్తల్ మండలం భూత్పూర్ గ్రామం వద్ద నిర్మించిన భూత్పూర్ రిజర్వాయర్ కు కృష్ణానది వరద జలాలతోనే నింపాల్సి ఉంది. రిజర్వాయర్ గేటు మరమ్మతు కారణంగా రెండురోజులు మాత్రమే చిన్న గోపులాపూర్ పంప్ హౌస్ నుంచి రిజర్వాయర్‌కు నీటి పంపింగ్ కొనసాగినప్పటికీ మరమ్మతు పేరుతో నీటిపారుదల శాఖ అధికారులు పం పింగ్ బంద్ చేశారు. దీంతో రిజర్వాయర్ ఏమాత్రం నీరు వచ్చి చేరడం లేదు. ప్రస్తుతం భూత్పూర్ రిజర్వాయర్‌లో 0.01 టీఎంసీ నీరు మాత్రమే ఉందని, త్వరలో ప్రారంభమయ్యే వానకాలం సీజన్‌కు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందుతుందో లేదో అనే అయోమయ పరిస్థితిలో రైతులు మునిగి పోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
గతేడాదిలోనే చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ గేట్ల మరమ్మతు పనులు చే యాల్సి ఉంది. గేట్ల మరమ్మ తు చేసే గుత్తేదారు రాష్ట్రమం తా ఒకరే ఉండడంతో వారి రాక ఆలస్యమవడంతోనే జూన్ రెండో వారంలో గేట్ల మరమ్మతు పనులను చేపడుతున్నాం. రిజర్వాయర్ ఎగువ ప్రాంతంలో పెద్దవాగు నుం చి భారీ స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉంది. ఏ సమయంలోనైనా వరద వస్తే, రిజ ర్వాయర్ గేట్లు ఎత్తే పరిస్థితి కష్టంగా ఉన్నందువల్లనే, ప్రస్తు తం రిజర్వాయర్ కు కృష్ణా వరద జలాల నుంచి స్టేజ్ వన్, స్టేజ్-2 పంప్ హౌస్‌ల నుంచి పంపింగ్ ప్రారంభించి రెండు రోజులు కొనసాగిం చాం. మరమ్మతుల కోసం పంపింగ్ నిలిపి వేశాం. ప్రస్తు తం రిజర్వాయర్‌లో ఒక టీఎంసీకి పైగా మీరు నిల్వ ఉన్న ది. 20 రో జుల్లో గేట్ల మరమ్మతు పనులు పూర్తిస్థాయిలో యుద్ధప్రాతిపదికన చేపట్టి, గేట్ల మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. మరమ్మత్తు పనులు పూర్తికాగానే రిజర్వాయర్కి నీటి పంపింగ్ ప్రారంభించేందుకు చర్యలు చేపడతాం.
– సతీశ్‌కుమార్,డీఈ