గద్వాల, మార్చి 5 : జూరాల ప్రాజెక్టు కింద పంటల సాగు చేసిన రైతులకు సాగునీటిపై సందిగ్ధం నెలకొన్నది. పంటలు చేతికి రావాలంటే ఇంకా 1.2 టీఎంసీల నీరు అవసరం ఉన్నది. ప్రస్తుతం పంటలకు సరిపడే నీరు ప్రాజెక్టులో లేదు. కర్ణాటక కరుణిస్తే తప్పా జూరాల ప్రాజెక్టు కింద పంటలు చేతికొచ్చే అవకాశం కనిపించడం లేదు. దీంతో మంత్రితోపాటు ఇరిగేషన్ అధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అయితే గత నెల మొదటి వారంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంత్రితోపాటు ఎమ్మెల్యేలు సాగు, తాగునీటి కోసం 5 టీఎంసీలు విడుదల చేయాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఇరిగేషన్‌శాఖ మంత్రి శివకుమార్‌ను కలిసి కోరారు. అందుకు వారు సానుకూలంగా స్పందించి నాలుగు టీఎంసీల నీటిని విడుదల చేయడానికి అంగీకరించినట్లు మంత్రి, ఎమ్మెల్యేలు తెలిపారు. కాగా కన్నడ సీఎం, మంత్రిని కలిసి నెలరోజులు అవుతున్నా ఇప్పటి వరకు నారాయణపూర్ డ్యాం నుంచి జూరాల ప్రాజెక్టుకు కేవలం 0.45 టీఎంసీల నీటిని మాత్రమే వదిలినట్లు అధికారులే చెబుతున్నారు. ఈ నీరు కూడా కేవలం తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నట్లు అక్కడి అధికారులు చెప్పడంతో జూరాల డ్యాం ఆయకట్టు పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం కర్ణాటక అంగీకరించిన ప్రకారం ఈనెల చివరి నాటికి మిగిలిన 3.55 టీఎంసీల నీరు విడుదల చేస్తే తప్పా జూరాల ప్రాజెక్టుపై ఆధారపడ్డ ప్రాజెక్టుల కింద పంటలు చేతికి వచ్చే అవకాశం లేదు. మంత్రితో పాటు ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రితోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసిన సమయంలో మన ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులను వెంట తీసుకెళ్లలేదు. కాగా నీటి విషయమై కన్నడ ప్రభుత్వ వదులు తామన్న నీటి విషయం తమ దృష్టికి రాలేదని ఇరిగేషన్ అధికారులు పేర్కొన్నారు. అందుకే ఈ విషయంలో కర్ణాటక అధికారుల నుంచి తెలంగాణకు ఎలాంటి సమాచారం రాలేదు.
పాలమూరు జిల్లా వరప్రదాయిని జూరాల ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు కింద యాసంగిలో రైతులు వివిధ పంటలు సాగు చే శారు. అయితే ప్రస్తుతం ఈ పంటలు చేతికొచ్చే వరకు డ్యాం నీరు సరిపోతుం దా? లేదా? అనే దానిపై నీలినీడలు కమ్ముకున్నాయి. జూరాల ప్రాజెక్టు నీటిపైనే ఆయకట్టుతోపాటు నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. అయితే ప్రాజెక్టులో రోజురోజుకూ నీరు ఇంకిపోతుండడంతో రైతులు సాగు చేసిన పంటలకు చివరి వరకు అందుతుం దా..? లేదో? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పంటలు చేతికొచ్చే సమయంలో నీరు అందకపోతే రైతుల కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయ్యే అవకాశం లేకపోలేదు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో యాసంగికి సంబంధించి ఆయా ప్రాజెక్టుల నీటి లభ్యత మేరకు సాగునీటి షెడ్యూలు విడుదల చేశారు. అందులో భాగంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో ఉన్న జూరాల ప్రాజెక్టులో ఉన్న నీటిలభ్యత ఆధారంగా వారబంది ద్వారా నీటిని విడుదల చేయడానికి చర్యలు చేపట్టారు. అందులో భాగంగా రైతులు యాసంగిలో కేవలం ఆరుతడి పంటలు మాత్రమే వేసుకోవాలని సూచించినప్పటికీ రైతులు ఎక్కువ భాగం వరి వేయడంతో ప్రస్తుత నీటి విడుదలపై సందిగ్ధం నెలకొన్నది. అధికారులు, రైతులను ఆరుతడి పంటలు వేసుకోమంటే తరి పంటలు వేసుకోవడంతో ప్రస్తుతం పంట చేతికొచ్చే వరకు నీరు సరిపోతుందా? లేదా? అనే దానిపై అధికారులు లెక్కలు వేస్తున్నారు.
జూరాల ప్రాజెక్టు కింద నెట్టెంపాడు ఎత్తిపోతలతోపాటు కోయిల్‌సాగర్, భీమా ఎత్తి పోతల పథకాలు ఆధారపడి ఉన్నాయి. వీటితోపాటు మిషన్ భగీరథకు జూరాల ప్రాజెక్టు నుంచే నీటిని వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీరు ఇంకిపోతుండడంతో వేసవి కాలంలో అటు సాగు.. ఇటు తాగునీటిపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. దీంతోపాటు రామన్‌పాడు తాగునీటి పథకానికి ఈ నీటినే వినియోగిస్తున్నా రు. దీంతో ఇటు రైతులు అటు ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉ న్నది. జూరాల డ్యాం పరిధిలో అధికారులు సాగునీటి విడుదల షెడ్యూ ల్ ప్రకారం జూరాల కుడి, ఎడమ కాల్వ ద్వారా 34,346 ఎకరాలు, నెట్టెంపాడు ఎత్తిపోతల కింద 24,800 ఎకరాలు, భీమా ప్రాజెక్టు కింద 29,000 ఎకరాలు, కోయిల్‌సాగర్ కింద 8వేల ఎకరాలకు నీటిని ఏప్రిల్ 15 వరకు విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈ మేరకు రైతులు పంటలు సాగు చేశారు. అయితే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా ర్యాలంపాడు రిజర్వాయర్ కింద రైతులకు 24,800 ఎకరాలకు మాత్రమే వారబంది పద్ధతిలో సాగునీరు ఇస్తామన్నారు. అయితే ప్రస్తుతం ర్యాలంపాడు ప్రాజెక్టు పరిధిలో అధికారుల అంచనా ప్రకారం 48 వేల ఎకరాలు రైతులు పంటలు సాగు చేశారు. ఈ పంటలకు చివరి వరకు నీరు అందుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవంగా ఈ రిజర్వాయర్ పరిధిలో 105 ప్యాకెజీ కింద డీ-5 వరకు అంటే సుమారు 10 కిలోమీటర్ల మేర పంటలు సాగు చేయాల్సి ఉండగా రైతులు 107 ప్యాకేజీ అంటే సుమారు 50 కిలోమీటర్ల మేర పంటలు సాగు చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 9.6 టీఎంసీలు. ప్రాజెక్టు డెడ్‌స్టోరేజీ వచ్చేసి 3.7 టీఎంసీలుగా ఉంటుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 1.35 టీంసీలు (లైవ్) ఉంది. ఈ నీటిని సాగునీటి అవసరాలకు వినియోగించుకోనుండగా, తాగునీటి అవసరాల కోసం 2.663 వినియోగించనున్నారు. ప్రాజెక్టు కింద తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకున్నా సాగునీటి ఇబ్బందులు తప్పేలా లేదు.
సాగునీటి విషయంలో కర్ణాటక ప్రభుత్వంపై ఆధారపడ్డాల్సిన పరిస్థితి తలెత్తింది. తప్పా ఈ యాసంగిలో గండం గట్టెక్కే పరిస్థితి లేదు. రోజురోజుకు జూరాలలో నీటిసామర్థ్యం తగ్గుతుండడంతో ఇది గ్రహించిన మంత్రి జూపల్లి కృష్ణారావుతోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కర్ణాటకలోని బెంగళూర్‌లో సీఎం, మంత్రిని కలిసి ఉమ్మడి పాలమూరు జిల్లాకు 5 టీఎంసీల నీరు వదిలితే ఈ యాసంగిలో సాగు, తాగునీరు అవసరాలు తీరుతాయని విన్నవించారు. అందుకు వారు సానుకూలంగా స్పందించినట్లు 0.45 టీఎంసీలు విడుదల చేసింది. ఈ నీటిని నెట్టెంపాడు, భీమా-1, భీమా-2, కోయిల్‌సాగర్‌కు వచ్చిన నీటిని విడుదల చేశారు. అయితే ఆ విడుదల చేసిన నీరు కేవలం తాగునీటి అవసరాలకే అని కర్ణాటక ప్రభుత్వం అధికారులకు చెప్పినట్లు సమాచారం. కాగా అధికారులకు అధికారికంగా సమాచారం లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కన్నడ ప్రజాప్రతినిధులతోపాటు అధికారులు తెలంగాణకు తాగునీటి అవసరాలకే మాత్రమే నీటిని విడుదల చేసినట్లు చెబుతుండగా, సాగునీటి విషయం చెప్పకపోవడం కొసమెరుపు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టుకింద ఈ యాసంగిలో పంటలు చేతికి రావాలంటే ఇంకా అధికారుల అంచనా ప్రకారం 1.2 టీఎంసీల నీరు అవసరం. అది కూడా ఈనెల చివరి నాటికి అందితేనే పంటలు చేతికొస్తాయి. కర్ణాటక ప్రభుత్వం రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఆ దిశగా ముఖ్యమంత్రితోపాటు జిల్లా మంత్రి కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
జూరాల ప్రాజెక్టు సామర్థ్యం తక్కువగా ఉండడం.. దీని మీద భీమా-1, భీమా-2, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఆధారపడి ఉన్నా యి. అవసరాలకు తగ్గట్టు డ్యాంలో నీరు లేదు. రైతులు నీటిని పొదుపుగా వాడు కోవాలి. తాగునీటి కోసం వేసవి ముగిసే వర కు 0.4 టీఎంసీలు వినియోగించాలి. పంటలు చేతికి రావాలంటే ఇంకా 1.2 టీఎంసీలు అవసరం. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్ననీటి ఆధారంగా వారబంది పద్ధతిలో నీళ్లిస్తున్నాం. స రిపెట్టు కోవాలంటే మూడు, నాలుగు రోజులకోసారి నీళ్లు అం దిస్తున్నాం. దానిని రెండ్రోజులకు తగ్గించి పంటలు కాపాడే ప్రయత్నం చేస్తాం. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ 15 వరకు అందిస్తాం. నారాయణపూర్ నుంచి ఇన్‌ఫ్లో తక్కువగా వస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.