జూరాల డ్యాంలో తగ్గిన నీటిమట్టం జూరాల ప్రాజెక్టులో రోజురోజుకూ నీటిమట్టం తగ్గుతున్నది. ప్రస్తుతం 0.218 టీఎంసీలు మాత్రమే నమోదైంది. ఈ నీటిని ఏప్రిల్ 15వ తేదీ వరకు యాసంగిలో రైతులు సాగు చేసిన పంటలకు వారబంది పద్ధతితో విడుదల చేయాల్సి ఉన్నది. అయితే నీళ్లు ఏప్రిల్ వరకు పంటలకు సరిపోతాయా..? లేదా..? అనేది రైతులకు అధికారులు చెప్పలేకపోతున్నారు.
ఈనెల చివరి నాటికి ఒక టీఎంసీ నీరు కర్ణాటక విడుదల చేస్తే యాసంగి పంటలు చేతికొచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పక్క రాష్ట్ర ప్రభుత్వం కనికరిస్తేనే మన రైతుల పంటలు చేతికొచ్చే అవకాశం ఉన్నది. ప్రతిపాదిత ఆయకట్టు జూరాల ప్రాజెక్టు కింద అధికారులు యాసంగిలో ఆయకట్టును ప్రతిపాదించారు. కుడి, ఎడమ కాల్వల కింద 34,346 ఎకరాలు, నెట్టెంపాడ్ కింద 24,800 ఎకరాలు, భీమా కింద 29 వేల ఎకరాలు, కోయిల్‌సాగర్ కింద 8 వేల ఎకరాలు, ఆర్డీఎస్ కింద 35 వేల ఎకరాలు ప్రతిపాదించారు.
గద్వాల, ఏప్రిల్ 5 : జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండడంతో జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటికి ముప్పు ము ంచుకొస్తున్నది. నడిగడ్డ రైతులకు రెండు నదుల ఉన్నా సాగునీటి కోసం ఇతర రాష్ర్టాలపై ఆధారపడాల్సిన పరిస్థి తి నెలకొన్నది. ప్రస్తుతం ఇటు జూరాల ప్రాజెక్టు.. అటు ఆర్డీఎస్కు తుంగభద్ర నీరు విడుదల కావాలంటే కర్ణాటక ప్రభుత్వంపై ఆధారపడాల్సి ఉండడంతో జిల్లా రైతుల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది.
కన్నడ కరు ణించి దయ తలిస్తే తప్పా మన పంటలు చేతికొచ్చే పరి స్థితి కనిపించడం లేదు. పక్క రాష్ట్రంలోని ప్రాజెక్టుల నుం చి నీళ్లు వదిలితేనే మన రైతులు గట్టెక్కే అవకాశం లేదు. లేదంటే పంటలు ఎండిపోయి రైతుల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మిగిలిపోనున్నది. ప్రస్తుతం వరి చేతికొచ్చే దశలో ఉన్నది. ఈ దశలో నీళ్లు సమృద్ధిగా అందకుంటే పంట ఎండిపోయే… లేదా.. గింజ తాళుగా మారే ప్రమాదం ఉన్నదని రైతులు ఆందోళన చెందు తున్నారు. సాగునీటి విడుదలలో ప్రభుత్వం, అధికారుల సమన్వయ లోపం రైతుల పాలిట శాపంగా మారింది.
హైదరాబాద్‌లో ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో అప్పుడు ప్రాజెక్టుల్లో ఉన్న నీటినిల్వ సామర్థ్యంతో పాటు ఎగువ నుంచి వచ్చే నీటిని అంచనా వేసుకొని ప్రణా ళిక సిద్ధం చేసి విడుదల చేశారు. ఈ మేరకు యా సంగి లో వారబంది పద్ధతిలో ఏప్రిల్ 15వ తేదీ నాటికి నీటిని విడుదల చేస్తామని ప్రభు త్వం ప్రకటించింది. యాసంగిలో కేవలం ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించక పోవడంతో రైతులు ఎక్కువ శాతం వరిని సాగు చేయడంతో ప్ర స్తుతం సాగుకు నీటి సమస్య తలెత్తి రైతులు ఆందోళన చేసే పరిస్థితి నెలకొన్నది.
తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను ఇచ్చే క్రమంలో కర్ణాటక అరకొర మాత్రమే నీటిని విడుదల చేసింది. అది కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులోకి చేరకపోవడంతో సాగైన పంటలకు నీటి కొరత ఏర్పడింది. యాసంగిలో రైతులకు నీరు అందించడంలో భాగంగా గత నెలలో ఉమ్మడి పాలమూరు ఇన్చార్జి మంత్రితోపా టు ఎమ్మెల్యేలు కర్ణాటక ముఖ్యమంత్రితోపాటు ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిసి తమకు 4 టీఎంసీల విడుదల చేయాలని, అప్పుడే సాగు, తాగునీటి సమస్య తీరుతుందని కోరారు.
అందుకు వారు సానుకూలంగా స్పందించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జూరాల ప్రాజెక్టుకు కేవలం టీఎంసీ నీటిని మాత్రమే కన్నడ ప్రభుత్వం వదిలింది. ఈనెల చివరి నాటికి మిగతా నీటిని విడుదల చేస్తే రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే అవకాశం ఉ న్నది. ఆ దిశగా ప్రభుత్వం ప్రజాప్రతినిధులు కృషి చే యడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక విడు దల చేసిన అరకొర నీరు రైతులకు ఏమూలకూ సరిపోవడం లేదు. దీంతో జూరాల కింద సాగునీటి ముప్పు ముం చుకొస్తున్నది. నెట్టెంపాడ్ ప్రాజెక్టు పరిధిలోని ర్యాలంపాడ్ రిజర్వాయర్ కింద సాగైన పొలాలకు నీరందక 3 వేల ఎకరాలకుపైగా పంట ఎండిపోయింది.