మరికల్, (ధన్వాడ), ఫిబ్రవరి 20: మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఆనూహ్య ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో నెలకొన్న సమస్యలను సర్పంచ్ పట్టించుకోవడం లేదని 14 మంది వార్డు సభ్యులకుగానూ 9మంది వార్డు సభ్యులు రాజీనామా పత్రాలను మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీవో బాలాజీకి సమర్చించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ శివకుమార్ మాట్లాడుతూ సర్పంచ్ కస్పే గోవర్ధన్ గ్రామ పంచాయతీ నిధులు రూ.3.40 లక్షలు వార్డు సభ్యులకు, పంచాయతీ కార్యాదర్శికి కూడా తెలియకుండా డ్రా చేసుకున్నాడని, నిధులు దుర్వినియోగం చేసిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మండల కేంద్రంలో ఆరు నెలలుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని, నీరురాని విషయం సర్పంచ్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని వార్డు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. వార్డుల్లో పేరుకుపోయిన సమస్యలను పలుమార్లు సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో సోమవారం రాజీనామా చేస్తున్నట్లు ఉప సర్పంచ్ శివకుమార్, వార్డు సభ్యులు శారద, రాము, విజయ్, రామకృష్ణారెడ్డి, నాగరాజు, లక్ష్మి, కుర్వ నాగరాజు, అలివేలు ప్రకటించారు.