గద్వాల అర్బన్, ఏప్రిల్ 24: అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టి కృష్ణాపరివాహక ప్రాంతాలను ఎడారిగా చేయాలని కర్ణాటక ప్రభుత్వం చూస్తోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కర్ణాటక ప్రభుత్వం కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో అక్రమ ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపట్టి తెలంగాణకు వచ్చే సాగు, తాగునీరు రాకుండా చేసేందుకు పూనుకుంటున్నారన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్డీఎస్ వద్ద కుడి భాగంలో కాల్వలను తవ్వి నీటిని తరలించే ప్రక్రియ చేపట్టి ఆర్టీఎస్ కింద 80వేల ఎకరాల ఆయకట్టుకును ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నదన్నారు. ఈ ఘటన మరువక ముందే మళ్లీ మరో జలజగడం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం గంజిపల్లి వద్ద 0.2 టీఎంసీల ప్రాజెక్ట్ చేపట్టడానికి 192 కోట్లతో పంపు నిర్మాణం కోసం టెండర్లు పిలవడం జరిగిందన్నారు. ఆన్లైన్ ద్వారా సమాచారంతో వెలుగులోకి వచ్చిందన్నారు. మరో ప్రాజెక్ట్ రాయచూర్‌కు తాగునీరు అందించడానికి 0.2 టీఎంసీల టెండర్లు ఖరారయ్యి పనులు చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణకు మరోసారి దిగువ ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు కృష్ణానదిపై ఆధారపడ్డ సాగు, తాగునీరుకు భవిష్యత్‌లో చాలా ఇబ్బందిగా మారనున్నదన్నారు.
తెలంగాణకు అన్యాయం జరుగుతున్న కర్ణాటక బీజేపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఈ ప్రాంత నాయకురాలు ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సమన్వయంతో సాగునీరు అందిస్తు అందరూ బాగుండాలని పరిపాలిస్తున్నారని అన్నారు. పక్క రాష్ర్టాలకు ఏ చిన్న సహాయం కావాలన్న సీఎం కేసీఅర్ వెంటనే చేస్తున్నారన్నారు. కానీ పక్క రాష్ర్టాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తున్నామన్నారు. ఈ విషయంపై ఇతర రాష్ట్ర ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తామన్నారు. జలచౌర్యంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యే విధంగా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, ఎంపీపీలు ప్రతాప్‌గౌడ్, విజయ్‌కుమార్, పార్టీ గద్వాల మండలాధ్యక్షుడు రమేశ్‌నాయుడు తదితరులు ఉన్నారు.