వనపర్తి : తెలంగాణలో విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. ఒక పక్క హాస్టల్, మధ్యాహ్న భోజనం కలుషితమై ప్రాణాలు పోవడం , ఆసుపత్రుల పాలవడం ఆందోళన కలిగిస్తుండగా మరో పక్క విద్యార్థుల ఆత్మహత్యలు కలవరానికి గురిచేస్తున్నాయి.
తాజాగా వనపర్తి (Vanaparthy) జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ గురుకుల పాఠశాలలో లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు జోవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివశిస్తున్నారు.
పాఠశాలలో మంగళవారం కబడ్డీ (Kabaddi) ఆడుతుండగా గాయం కావడంతో బుధవారం పాఠశాల సిబ్బంది ప్రవీణ్ బంధువులకు సమాచారం అందజేశారు. ప్రవీణ్‌కు చికిత్స చేయించేందుకు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌కు కలువడంతో డార్మెటరీ రూంలో విశ్రాంతి తీసుకుంటున్నాడని చెప్పడంతో బంధువులు అక్కడికి వెళ్లి చూడగా ప్రవీణ్ ఫ్యానుకు ఉరివేసుకుని కనిపించాడు .
వెంటనే విద్యార్థి ప్రవీణ్‌ను వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని డాక్టర్లు నిర్దారించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.