పెద్దమందడి, మే 28 : ఫర్టిలైజర్ దుకాణాలలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్, ఎస్ఐ శివ కుమార్ అన్నారు. బుధవారం పెద్దమందడి మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాలలోని ఫర్టిలైజర్ దుకాణాలలో తనఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాప్ లలో నిల్వ ఉన్న పత్తి విత్తనాల ప్యాకెట్లు, వరి విత్తనాల ప్యాకెట్లను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు అందరూ నాణ్యమైన విత్తనాలను అమ్మాలని ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి డీలరు రైతులు తీసుకున్న విత్తనాలకు రసీదు కచ్చితంగా ఇవ్వాలని సూచించారు. రైతులు కూడా లైసెన్స్ గల దుకాణాలలోనే విత్తనాలను కొనుగోలు చేయాలని వారు కోరారు. బయట వ్యక్తులతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా విత్తనాలను తీసుకోకూడదని గ్రామాలకు ఆటోలు తదితర వాహనాలలో విత్తనాలు కానీ ఎరువులు కానీ విక్రయిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి సైదులు యాదవ్, ఎస్ఐ శివకుమార్ తదితరులు ఉన్నారు.