ఖిల్లాఘనపురం, మార్చి 8: వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలంలోని సోలిపూరంలో భారీగా రేషన్ బియ్యం (PDS Raice) పట్టుబడింది. సోలిపురం నుంచి నూతలగుంటకు వెళ్లే మార్గంలో ఉన్న బొంగు శ్రీను అనే వ్యక్తి చెందిన వ్యవసాయ పొలం వద్ద నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించిన పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 85 బ్యాగుల పీడీఎస్ రేషన్ బియ్యం పట్టుబడినట్లు తెలుస్తున్నది. గత నెల రోజులుగా మండల పరిధిలో రైస్‌మిల్లులకు పెద్దమొత్తంలో రేషన్ బియ్యం సరాఫర జరుగుతున్నట్టు సమాచారం.
కాగా, గతంలో కూడా పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టుబడినప్పటికీ అధికారులు తక్కువగా చూపించి కేసులు నమోదుచేశారు. అయితే పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు కేసులు పెడుతున్నప్పటికీ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తులు మాత్రం భయపడడం లేదు. ఇకనైనా రేషన్ బియ్యం అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ నెల 6న సోలిపురంలో అక్రమ రేషన్ బియ్యంను పట్టుకున్నారు. సింధు రైస్ మిల్లు యజమాని జిల్లాలో అక్రమ దందా చేస్తూ.. జిల్లా అధికారులను సంతృప్తి పరుస్తూ తప్పించుకుంటున్నాడు. దీంతో రాష్ట్ర సీసీఎస్ సిబ్బంది పక్కా ప్లాన్‌తో రాత్రి 10.30లకు సదరు మిల్లుపై దాడి చేసి పీడీఎస్ బియ్యాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మిల్లు యజమాని అధికారులను ప్రలోభపెట్టి ఆ అక్రమ బియ్యం బయట దొరికినట్టు చూపి కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇది వైరల్ కాకుండా చూసుకొని అధికార పార్టీ నాయకుల అండదండలతో కేసు మాఫీ చేసుకోవాలని చూస్తున్నారని.. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు స్పందించి అక్రమ రవాణాను అరకట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.