నాగర్‌కర్నూల్, ఆగస్టు 14: జిల్లాకేంద్రంలో 75వ స్వాతం త్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా అధికారులు పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యఅతిథిగా ప్రభు త్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరేడ్‌లో పాల్గొని జాతీయజెండా ఆవిష్కరించనున్నారు. ఉదయం 10:30 గంటలకు జెండావిష్కరణ అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. 10:35 గంటలకు పోలీస్ కవాతు, 10:40గంటలకు ముఖ్యఅతిథి సందేశం చేయనున్నారు. అనంతరం 11గంటలకు కలెక్టర్ మనుచౌదరి, ఎస్పీ సాయిశేఖర్తో కలిసి స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించనున్నారు. అదేవిధంగా పరేడ్‌గ్రౌండ్‌లో గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, ఉద్యానవనం, వైద్యారోగ్య, అటవీ, స్త్రీ శిశుసంక్షేమ శాఖల ప్రగతిని ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించనున్నారు. హార్టికల్చర్, పల్లెప్రగతి, ఆరోగ్యం, ఐసీడీఎస్, విద్య, డీఆర్డీఏ, సంక్షేమ, పశుసంవర్ధక తదితర శాఖలకు సంబంధించిన అధికారులు స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. 11:10గంటలకు విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల సాంస్కృతిక కళలను ప్రదర్శించనున్నారు. 11:30గంటలకు ఉద్యోగులకు ప్రశంసాపత్రాల పంపిణీ, 12:30గంటలకు జాతీయ గీతాలాపన కార్యక్రమంతో వేడుకలు ముగియనున్నాయి.
తెలకపల్లి, ఆగస్టు 14: స్వాతంత్య్ర వేడుకలకు మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధమయ్యాయి. త్రివర్ణ రంగుల కాగితాలతో కార్యాలయాలను అలంకరించారు. జాతీయజెండా ఎగురవేసేందుకు సిద్ధం చేశారు. కార్యక్రమాలకు హాజరయ్యే వారికి ఇప్పటికే ఆయా శాఖల వారీగా ఆహ్వానాలు పంపించారు.
కల్వకుర్తి రూరల్, ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలల వద్ద శనివారం ఏర్పాట్లు చేశారు. ఆదివారం నిర్వహించనున్న పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్వాడీ, పాఠశాలలను మూడు రంగుల జెండా కాగితాలతో అలంకరించారు. వేడుకలకు హాజరయ్యే వారు మాస్కులు ధరించాలని, తప్పనిసరిగా భౌతికదూరం పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనల మేరకు ఆయా శాఖల అధికారులు వేడుకలు జరుపుకోవాలని సూచించారు.