వనపర్తి టౌన్, ఏప్రిల్ 19 : వనపర్తి మండలం సవాయిగూడెం రైతులు ఆందోళన చేపట్టారు. సవాయిగూడెం గ్రామ శివారులోని సర్వే నెంబర్ 117లోని భూమిలో ఆదివారం రైతులు నిరసన వ్యక్తం చేస్తూ సోలార్ వద్దు వ్యవసాయం ముద్దు అంటూ నినదించారు. ఈ సందర్భంగా రైతులు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ డేగ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంజనేయస్వామి ఆలయానికి 11ఎకరాల పొలం ఉండగా కొన్ని దశాబ్దాలుగా అదే గ్రామానికి చెందిన పలువురు రైతులు సాగు చేస్తున్నారన్నారన్నారు.
అందులో 5 ఎకరాలు తరి పొలం ఉండగా మిగతా 5ఎకరాల్లో మెట్ట ప్రాంతంలో వేరుశనగ పంట, మినుము పంట సాగుచేస్తూ ప్రతి ఏడాది దేవాదాయ శాఖ శిస్త్తూ చెల్లిస్తూ రైతులు జీవనం సాగిస్తున్నారన్నారు. ఇటీవల నియంతృత్వంతో ఏకపక్ష నిర్ణయంతో గ్రామసభలో కూడా వ్యతిరేకించిన సోలార్‌ను ఏర్పాటు చేసేందుకు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు పనులు చేపడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూమిపై సంబంధిత కలెక్టర్, ఆర్డీవో, దేవాదాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు అందజేసినట్లు గుర్తుచేశారు.
సోలార్ ప్లాంట్ వేస్తే గ్రామానికి చెందిన రైతుల కుటుంబాలు, కూలీలు ఉపాధి కోల్పోవడంతో పాటు కౌలు రైతులు జీవనోపాధికి దూరమవుతారన్నారు. పక్కనే డీ-8 కాల్వ, చెరువు, కుంటలు అందుబాటులో ఉన్నాయని ప్రజాప్రతినిధులు రైతు దృష్టితో ఆలోచించి విరమించుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులు మొండి గా వ్యవహరిస్తే ఆందోళనలకు కూడా వెనుకాడమని రైతులు హెచ్చరించారు.
కాగా ప్రతి ఏడాది సాగు చేస్తున్న మినుము పంటలు అందుకు సంబంధించిన ఆధారాలు భూమిలో కనిపించినప్పటికీ దేవాదాయ శాఖ అధికారులు బీడు భూమిగా ఉందని చెప్తున్నారని రైతులు ఆశ్చర్యానికి గురయ్యారు. సాగుచేస్తూ ఆంజనేయ గుడికి శిస్తూ చెల్లిస్తూ ప్రతి ఏడాది జీవనం సాగిస్తున్నామని రైతులు చెప్పారు. నిరసన కార్యక్రమంలో రైతు లు వంశీరెడ్డి, మోహన్‌రెడ్డి, మహేశ్, కృష్ణ య్య, రాజు, సాయిలు, రమేశ్, దినేశ్, మురళి, మొగులయ్య, వెంకట్‌రెడ్డి, వెంకటేశ్, శ్రీను ఉన్నారు.