Child Marriages | వనపర్తి: బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. 2015 జనవరి 22న ‘బేటీ బచావో- బేటీ పడావో’కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా గత నెల 22 నుంచి మార్చి ఎనిమిదో తేదీ వరకూ మహిళా సాధికారత- అమ్మాయిల సంరక్షణ అనే అంశంపై జిల్లాలో అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన జిల్లా స్థాయి సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల్య వివాహాలు పూర్తిగా అరికట్టడంతోపాటు అమ్మాయిలకు రక్తహీనత నుండి విముక్తి కల్పించి మంచి విద్యాభ్యాసం అందించాలన్నారు.
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే వెంటనే ‘1098’ అనే టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బాల్య వివాహాలు చేసే తల్లిదండ్రులతోపాటు పెండ్లికి సహకరించే వారిపై, పెండ్లి చేసే అర్చకుడు/ ఖాజీ/ పాస్టర్లపై కేసులు నమోదు చేస్తామన్నారు. అవసరం అయితే వారిని బైండోవర్ చేస్తామని హెచ్చరించారు.
జిల్లాలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 888 మంది మహిళలు మాత్రమే ఉన్నారని కలెక్టర్ ఆదర్శ్ సురభి చెప్పారు. స్త్రీ, పురుషుల మధ్య అంతరాన్ని క్రమంగా తగ్గించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు. అమ్మాయిల్లో రక్తహీనతను పారద్రోలడానికి వైద్య శాఖ, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. సరైన ఎదుగుదల లేఇన చిన్న పిల్లలను ఎన్ఆర్సీ సెంటర్‌కు పంపాలని కోరారు.
అమ్మాయిల చదువులు, పెండ్లి కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య సమృద్ధి యోజన పథకం తెచ్చిందని ఆదర్శ్ సురభి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి అమ్మాయి పేరున తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ప్రతి నెలా కొంత మొత్తం జమ చేస్తే అమ్మాయి యుక్త వయస్సు వచ్చేనాటికి ప్రతి ఏటా 8.6 శాతం వడ్డీతో కలిపి ఇస్తారని ఇది చాలా పెద్ద మొత్తం వస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రతి తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజన పథకం సద్వినియోగం చేసుకుని తమ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలకాలని కోరారు. అనంతరం బేటి బచావో బేటి పడావో ప్రచార గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీ. వెంకటేశ్వర్లు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీఎస్పీ కే ఉమామహేశ్వర రావు, జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, డీసీపీఓ ఎం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.