జడ్చర్ల టౌన్, జూలై 13 : కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ల వారీగా నియమాకమైన బీఎల్వోలు ఇంటింటికెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ పత్రాలను పంపిణీ చేశారు. ఎన్యూమరేషన్ పత్రంలో పొందుపరిచిన విధంగా వివరాలను నింపి ఇవ్వాలని సూచించారు. కానీ ఎన్యూమరేషన్ పత్రాలను ఏ విధంగా నింపాలన్న విషయాలను క్షుణ్ణంగా ఓటర్లకు వివరించడంలో బీఎల్వోలు విఫలమయ్యారు. తద్వారా ఎన్యూమరేషన్ పత్రాలను నింపేదేలా అని చాలా మంది ఓటర్లు ఆందోళనకు గురవుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రంలో కుడివైపు నింపాలా, ఎడమవైపు కాలమ్స్‌లో నింపాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు, మున్సిపాలిటీ పరిధిలో ఆశ, అంగన్వాడీ టీచర్లతోపాటు మున్సిపల్ సిబ్బందిని పోలింగ్ బూత్‌ల వారీగా బీఎల్వోలుగా నియమించారు. కానీ బీఎల్వోలుగా నియమాకమైన వారికి సైతం పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవటంతో ఎన్యూమరేషన్ పత్రాలను నింపడం అయోమయంగా మారింది. అక్షరాస్యులు, నిరాక్షరాస్యులు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎన్యూమరేషన్ పత్రం నింపడంతో ఇబ్బంది పడుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల్లో చాలా వరకు తప్పులు, కొట్టివేతలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎస్ఐఆర్ పక్రియలో భాగంగా ఓటర్ల గుర్తింపు కోసం 2002లో ఉన్న ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఎన్యూమరేషన్ పత్రాలను నింపాలని సూచిస్తూ తెలుగులో ప్రచురించిన ఓ టరు జాబితాను బీఎల్వోలకు అందజేశారు. 2002లో తెలుగులో ఉన్న ఓటరు జాబితా ఆధారంగా ఉన్న ఓటర్ల పేర్లను ఎన్యూమరేషన్ పత్రాల్లో రాస్తున్నారు. ఈ క్రమంలో అప్పట్లో తెలుగులో ప్రచురించిన ఓటర్ల జాబితాలో ఉన్న చాలా వరకు ఓటర్ల పేర్లలో అక్షరదోషాలు ఉండడంతో వాటిని ఆధారంగానే పత్రంలో రాయాలా లేక పేర్లను సరిచేసి రాయాలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఆధార్‌కార్డు, ఓ టరు ఐడీ కార్డులో తెలుగులో ఓ రకంగా అక్షరాలతో పేర్లు ఉండగా, 2002 ఓటరు జాబితాలో తెలుగులో ఉన్న పేర్లలో అక్షరాల్లో మార్పులు ఉండడంపై కన్‌ప్యూజన్‌గా ఉందని ఓటర్లు తెలియజేస్తున్నారు.
ఇంగ్లిష్‌లో ఉన్న ఓటరు జాబితాలో తమ పేర్లు సరిగానే ఉన్నాయని, తెలుగు భాషలోకి వచ్చేసరికి పేర్లలో అక్షరాల్లో తేడాలు వస్తున్నాయని ఓటర్లు తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వెళితే ఆధార్‌కార్డు వంటి గుర్తింపు కార్డును చూస్తారు కదా..తెలుగులో అక్షరాలు మారిపోతే తమకేమైనా ఇబ్బంది అవుతుందానని ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో బీఎల్వోలు సైతం ఎన్యూమరేషన్ పత్రాలను తె లుగులోనే నింపుతున్నారు. 2002 ఓటరు జాబితాలో ఉన్నట్లుగా పేర్లను రాయమని అధికారులు తెలిపారు. తమకు ఇంగ్లిష్‌లో రాయ డం రాదని, అందుకే తెలుగులోనే పత్రాల్లో వివరాలను రాస్తున్నామని కొందరు బీఎల్వోలు చెబుతున్నారు.
ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణలో బీఎల్వోలకు సాయంగా ఉండాల్సిన రాజకీయ పార్టీల తరఫున ఉన్న బీఎల్ఏ (ఏజెంట్లు)లు కేవలం ఎన్యూమరేషన్ పత్రాల పంపీణీ ప్రక్రియలో ఫొటోలకే పరిమితమవుతున్నట్లు తెలుస్తోంది. కొన్నిచోట్ల రాజకీయ పార్టీల తరఫున నియమాకమైన ఏజెంట్లు బీఎల్వోలకు పూర్తిస్థాయిలో సహకారం అందించటం లేదు. దీంతో బీఎల్వోలు మాత్రమే ఇంటింటికీ తిరిగి సర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.
అదే విధంగా కొత్త ఓటర్ల నమోదు కోసం ఫారం-6, కరెక్ష న్ కోసం ఫారం-8లను వినియోగించాలని అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించకపోవడంతో కొత్తగా ఓటు నమోదు చేసుకొనే వారు, ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాల మార్పులు, చేర్పులపై ఏఏ పత్రాలను నింపాలన్న విషయాలపై ఓటర్లకు స్పష్టత లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దీనిపై దృష్టిసారించి ఓటర్లకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్ల సందేహాలను నివృత్తి చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.