మక్తల్, జూన్ 12 : ఆగి ఉన్న లారీని ఓల్వో బస్సు ఢీకొట్టగా 18 మందికి గాయాలైన ఘటన గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం నర్సిరెడ్డిపల్లి గ్రామ సమీపంలోని 167 జాతీయ రహదారిపై చోటు చేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ నుంచి దుర్గాంబ ట్రావెల్ ప్రైవేట్ ఓల్వో బస్సు 29 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బుధవారం మధ్య రాత్రి బయలు దేరింది.
గురువారం తెల్లవారు జామున నర్సిరెడ్డిపల్లి సమీపంలో 167 జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బస్సు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో బస్సులోని 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మక్తల్ ప్రభుత్వం దవాఖానకు తరలించగా 18 మందిలో బస్సు డ్రైవర్‌కు రెండు కాళ్లు విరగగా ఏడుగురికి తీవ్ర గాయాలు ఇద్దరిని మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానకు, మిగతా వారిని కర్ణాకటకు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.