భూత్పూర్, మార్చి 5 : మహబూబ్‌నగర్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల భవితవ్యం పాలమూరు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నదని చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరు మండలం కరివెన వద్ద పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్ పనులను వారు పరిశీలించారు. టన్నెల్లో పనులను పరిశీలించారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు సుమారు 500 మంది ప్రాజెక్టును సందర్శించారు. కరివెన ఏవీఆర్ ప్లాంట్ (14వ ప్యాకేజీ)లో వారు మాట్లాడుతూ నార్లాపూర్, ఏదుల, వట్టెం రిజర్వాయర్లను పరిశీలిస్తూ ఇక్కడికి వచ్చామన్నారు. కరివెన ప్రాజెక్టును 19.5 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మిస్తున్నారని, ఇప్పటికే రిజర్వాయర్ దాదాపు 80 శాతం పనులు పూర్తవడంపై హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకే సీఎం కేసీఆర్ ఈ ఎత్తిపోతలకు రూపకల్పన చేశారని తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఇటీవల సుప్రీం కోర్టు నుంచి అనుమతి లభించిందన్నారు. ప్రభుత్వం పనులను త్వరగానే పూర్తి చేస్తుందన్నారు. మంచి చేసే ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా ఉండాలన్నారు. అనంతరం పనుల పురోగతిపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, అశోక్‌గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు.