హన్వాడ, జూన్ 23 : హన్వాడ మండలం టంకర జెడ్పీహెచ్ఎస్లో విద్యార్థుల సంఖ్యకు సరిపడా ఉపాధ్యాయులను నియమించి మెరుగైన విద్యను అందించాలని టంకర గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంకర జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 230మంది విద్యార్ధులు ఉండగా ప్రస్తుతం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని, విద్యార్ధుల సంఖ్యకు తగిన విధంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో వారి చదువులు ముందుకు సాగేదెలా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం ప్రతిఒక్కరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని, మెరుగైన విద్యను అందిస్తామని ప్రచారం చేస్తున్నా ఆచరణలో అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు కల్పించకుండా, కనీసం ఉపాధ్యాయులను కూడా విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు నియమించకపోతే మా పిల్లలను పాఠశాలలకు పంపి ప్రయోజనం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పాఠశాలలో హిందీ, సోషల్, సైన్స్‌తోపాటు మరికొన్ని సబ్జెక్టులకు కూడా ఉపాధ్యాయులు లేరన్నారు.
ఉపాధ్యాయులను నియమించాలని ఇప్పటికే నాలుగు సార్లు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేశా మని అయినా స్పందించకపోవడంతో మరోసారి కలెక్టరేట్‌కు వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పం దించి టంకర పాఠశాలకు ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా రెండు రోజుల్లో పాఠశాలకు ఉపాధ్యాయులను నియమిస్తామని, అలాగే నేను వచ్చి పాఠశాలను పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గ్రామస్తులు బోయిని శ్రీనివాసులు, జహంగీర్, కృష్ణయ్య, ఆంజనేయులు, శ్రీను, వెంకటయ్య, అంజి, తిరుపతయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.