బల్మూరు, జూన్ 14 : విద్యార్థులకు స్కాలర్ షిప్‌ల పంపిణీకి అచ్చంపేట నియోజకవర్గం తుమ్మెన్‌పేటలో పునాది వేశామని రానున్న రోజుల్లో తెలంగాణలో విస్తరింపచేస్తామని సినీ దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన అన్నారు. మండలంలోని తుమ్మెన్‌పేట గేట్ సమీపంలోని బీఎంఆర్ ఫంక్షన్‌హల్ 2025-26 విద్యా సంవత్సరంలో పదో తరగతి స్కూల్లో మొదటి, రెండో స్థానం సాధించిన వారికి, అదేవిధంగా తొమ్మిదో తరగతిలో మొదటి, ద్వితీయ స్థానంలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు దేవరకొండ ఫౌండేషన్ అధ్వర్యంలో స్కాలర్ షిప్ చెక్కులను ఆదివారం తన తల్లిదండ్రులు మాధవి, గోవర్దన్రావులతోపాటు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, డీఈవో రమేశ్‌ల చేతుల మీదుగా విజయ్ దేవరకొండ, రష్మికలు విద్యార్థులకు అందజేశారు.
మొత్తం నిజయోకవర్గంలో ఉన్న 45 ప్రభుత్వ పాఠశాలల్లో 181 మంది విద్యార్థులకు అందజేశారు. ప్రథమ స్థానం వారికి రూ. 10వేలు, ద్వితీయస్థానం వారికి రూ. 5వేల చొప్పున చెక్కులను అందజేశారు. అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న గమ్యం చేరవచ్చని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రులకు, గురువులకు, సమాజంలో పెద్దలకు గౌరవం ఇస్తే మనస్సులో ఉన్న లక్ష్యాలను చాలా సులభంగా సాధించవచ్చని అన్నారు. రానున్న రోజుల్లో ఫౌండేషన్ ద్వారా విద్యాభివృద్ధికి అనేక సేవలను అందజేస్తామని హామీ ఇచ్చారు.
పుట్టిన గడ్డకు సేవ చేయాలనే తపనతోనే నేడు విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం రష్మిక మాట్లాడుతూ నల్లమల ప్రాంతం దేవరకొండ ఇంటికి కోడలుగా రావడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవాలని, అన్నింటికి మూలం చదువే అని ఆమె విద్యార్థులకు సూచించారు. విజయ్ తల్లి మాధవి మాట్లాడుతూ తల్లిదండ్రుల మీద ప్రేమ, గౌరవం ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో రేవతిరెడ్డి, ఎంఈవోలు, ఎస్వోలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.