పెంట్లవెల్లి, జూలై 25 : భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతున్నారు. కొల్లాపూర్ పట్టణంలో విలువైన భూమిని కొందరు అధికారులు, అధికార పార్టీ నాయకులు బాధిత రైతు పాస్‌బుక్ నుంచి 15గుంటల భూమిని స్వాహా చేశారు. దీంతో బాధిత రైతులు గురువారం తాసీల్దార్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కొల్లాపూర్‌కు చెందిన గొల్ల బాలస్వామికి వారసత్వంగా వచ్చిన పాస్‌బుక్ నెంబరు టీ03080140153 ఖాతానెంబరు 289లో సర్వేనెంబర్ 65ఉలో 0.32 గుంటల భూమి ఉండేది.
ఈ భూమి నేషనల్ హైవే 167కేకు సమీపంలో ఉండటంతో బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.2కోట్లు వరకు డిమాండ్ ఉన్నది. 85సంవత్సరాల వయస్సు కలిగిన గొల్ల బాలస్వామి నుంచి భూమిని కాజేసేందుకు కొంత మంది ప్లాన్ చేశారు. గొల్ల బాలస్వామి పాస్‌బుక్ నుంచి రైతు ప్రమేయం లేకుండా 15గుంటల భూమిని వేరే వారి పేరుపైకి 2400006740 నెంబరు ద్వారా మ్యుటేషన్ చేశారు. దీంతో బాధిత రైతు 15గుంటల భూమి కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
ఇదిలా ఉండగా, మిగిలిన 16గుంటల భూమిని కొల్లాపూర్ పట్టణానికి చెందిన నాగలక్ష్మి అధికార పార్టీ నాయకుల సహకారంతో బుధవారం మతిస్థిమితం సరిగా లేని బాధిత రైతు గొల్ల బాలస్వామిని తీసుకొని వెళ్లి మ్యుటేషన్ చేయించుకున్నారు. ఈ విషయమై కార్యాలయంలో ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని బాధితుడు వాపోయాడు. కంప్యూటర్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాధిత రైతు గొల్ల బాలస్వామితోపాటు అతడి కుమారుడు, కుటుంబ సభ్యులు తాసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం బైఠాయించి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న అధికార పార్టీ నాయకులు తిరిగి భూమి రైతు పాస్‌బుక్ ఖాతాలో ఎక్కిస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు ఆందోళన విరమించారు. తాసీల్దార్ విష్ణువర్ధన్‌రావు మాట్లాడుతూ బాధిత కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు.